
రెండు రోజుల పాటు అమెరికాలో మోడీ పర్యటన
ఎప్పుడెప్పుడా అని ఊరిస్తున్న ప్రధాని నరేంద్రమోడీ అమెరికా పర్యటన తేదీలు ఖరారయ్యాయి.
ఎప్పుడెప్పుడా అని ఊరిస్తున్న ప్రధాని నరేంద్రమోడీ అమెరికా పర్యటన తేదీలు ఖరారయ్యాయి. ఈనెల 29, 30 తేదీలలో ఆయన అమెరికాలో పర్యటించనున్నారు. ఈ విషయాన్ని వైట్హౌస్ వర్గాలు ధ్రువీకరించాయి. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా స్వయంగా భారత ప్రధానమంత్రిని స్వాగతిస్తారు. వాళ్లిద్దరి మధ్య చర్చలతో అమెరికా- భారత దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత విస్తృతం అవుతుందని భావిస్తున్నట్లు వైట్హౌస్ అధికార వర్గాలు చెప్పాయి.
గుజరాత్ అల్లర్లలో పాత్ర ఉందన్న ఆరో్పణలతో మోడీకి గతంలో దాదాపు దశాబ్ద కాలం పాటు వీసా నిరాకరించిన అమెరికా.. ఇప్పుడు స్వయంగా తమ దేశ అధ్యక్షుడితోనే ఆహ్వానం, స్వాగతం పలికిస్తుండటం ఆ దేశ ప్రవర్తనలో వచ్చిన మార్పునకు నిదర్శనం. ఇప్పుడు ఇరు దేశాల అధినేతలు పలు అంశాలపై చర్చించనున్నారు. ముఖ్యంగా అఫ్ఘానిస్థాన్, సిరియా, ఇరాక్ లాంటి దేశాల్లో జరుగుతున్న పరిణామాలు కూడా వారిమధ్య చర్చకు రానున్నాయి.