కాంగ్రెస్ ఓటమికి కారణం ఎవరూ?: నట్వర్
న్యూఢిల్లీ : కాంగ్రెస్ సీనియర్ నేత, విదేశాంగశాఖ మాజీ మంత్రి నట్వర్‌సింగ్ మరోసారి తన మాటల తూటాలను ఎక్కుపెట్టారు. ఇటీవలి జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి బాధ్యులెవరని ఆయన సూటిగా ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ తరపున ప్రచారం చేసినవారు బాధ్యులు కాదా అన్నారు. ఎమర్జెన్సీ తర్వాత కూడా ఇందిరగాంధీకి 181 సీట్లు వచ్చాయని నట్వర్ సింగ్ గుర్తు చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ దుస్థితికి సోనియా, రాహుల్ బాధ్యులు కాదా అని ఆయన మరోసారి ప్రశ్నలు సంధించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలు కాంగ్రెస్కు కీలకమైనవన్నారు.
నట్వర్‌సింగ్ ఆత్మకథ (వన్ లైఫ్ ఈజ్ నాట్ ఇనఫ్: యాన్ ఆటోబయోగ్రఫీ)పుస్తకం శుక్రవారం విడుదల అవుతోంది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను సోనియా లక్ష్యంగా పుస్తకం రాయలేదని స్పష్టం చేశారు. 2011 ఆఖరులో పుస్తకం రాయడం మొదలుపెట్టానని, అయితే పుస్తకం రాయడం పూర్తయ్యేవరకూ ఏ విషయాన్ని తాను బయట పెట్టలేదు.
సోనియా గాంధీ ప్రధాని కాకుండా రాహుల్ అడ్డుకున్నారన్నది సరికాదని, నానమ్మ, తండ్రిని పోగొట్టుకొని..తల్లిని పోగొట్టుకోలేన్నారని, రాహుల్ ....సోనియా విషయంలో సరైన నిర్ణయమేనన్నారు. ప్రియాంకా వచ్చినా కాంగ్రెస్ భవిష్యత్ను కాలమే నిర్ణయిస్తుందన్నారు. పెద్దలను గౌరవించటం భారతీయ సంప్రదాయమని, అయితే కాంగ్రెస్లో తనకు సరైన గౌరవం దక్కలేదని నట్వర్ సింగ్ అన్నారు. నిజాలు బయటపెట్టవద్దని ప్రియాంక గాంధీ కోరారని, కాంగ్రెస్లో జరిగిన అవమానానికి ఆమె క్షమాపణ చెప్పారని ఆయన తెలిపారు.
ఇక శ్రీలంక విషయంలో తప్పు జరిగిందన్నది వాస్తవమని నట్వర్ సింగ్ వ్యాఖ్యానించారు. శ్రీలంకకు శాంతి సైన్యం పంపిన విషయాన్ని రాజీవ్ గాంధీ కేబినెట్తో సంప్రదించకుండా నిర్ణయం తీసుకున్నారన్నారు. తాను నరేంద్ర మోడీని కలిసింది బీజేపీతో ఒప్పందం కోసం కాదని నట్వర్ సింగ్ తెలిపారు. మోడీకి విదేశీ వ్యవహారాలపై సలహా ఇచ్చేందుకే కలిసినట్లు ఆయన తెలిపారు.
ఇరుగు పొరుగు దేశాలతో సంబంధాలు అవసరమని చెప్పానని, మోడీ నాయకుడిగా విజయవంతమయ్యారని ప్రశంసించారు. మోడీ ప్రధాని కావటానికి వసుంధరా రాజే పాత్ర కీలకమన్నారు. యూపీఏ హయాంలో ఇరుగుపొరుగు దేశాలతో సంబంధాలు దెబ్బతిన్నాయని అన్నారు. కాగా ప్రధాని నుంచి సోనియాకు ఫైళ్లు వెళ్లేవన్న మాటకు కట్టుబడి ఉన్నట్లు ఆయన వెల్లడించారు.