నీట్ రాయాలంటే.. ఇంత దారుణమా..
కన్నూరు: నేషనల్ ఎలిజబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్టు(నీట్) హాజరైన పలువురు అభ్యర్ధులకు దారుణ అనుభవాలు ఎదురయ్యాయి. పరీక్షకు హాజరు కావడానికి డ్రెస్ కోడ్ అమలులో ఉంది. దీంతో కేరళలో పరీక్ష రాయడానికి వచ్చిన విద్యార్థినులను ఇన్నర్‌వేర్ తీసేసి పరీక్షకు హాజరు కావాలని అధికారులు కోరారు. దీంతో కంగుతిన్న విద్యార్థినులు చేసేది లేక ఇన్నర్‌వేర్ తీసేసి పరీక్షకు హాజరయ్యారు.
పరీక్ష ముగిశాక మీడియాతో మాట్లాడిన విద్యార్థునుల తల్లిదండ్రులు తమ పిల్లలకు ఎదురైన చేదు అనుభవాలను పంచుకున్నారు. పరీక్షా హాలులోకి వెళ్తున్న తన కూతురిని ఆపిన అధికారులు ఇన్నర్‌వేర్‌ను తీసేసి రావాలని కోరినట్లు ఓ తల్లి తెలిపింది. మరో అమ్మాయి జీన్స్ వేసుకుని పరీక్షకు వెళ్లగా.. ప్యాంట్‌కు ఉన్న జేబులను, మెటల్ బటన్స్‌ను తొలగించుకుని రమ్మన్నారని ఆమె తండ్రి తెలిపారు.
ముస్లిం అమ్మాయిలను కూడా ఫుల్ లెంగ్త్ స్లీవ్స్‌ను వేసుకునేందుకు అనుమతించలేదని చెప్పారు. అధికారుల ప్రవర్తన కారణంగా ఎంత మంది అమ్మాయిలు పరీక్షను బాగా రాసి ఉంటారు? అని ఆయన ప్రశ్నించారు. అధికారులు పిల్లలతో ప్రవర్తించిన తీరు అమానుషమని అన్నారు. ఈ విషయంపై రాష్ట్ర ముఖ్యమంత్రి విజయన్‌కు లేఖ రాస్తానని రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బిందు కృష్ణా చెప్పారు. కాగా, ఆదివారం దేశవ్యాప్తంగా 104 కేంద్రాల్లో జరిగిన నీట్ పరీక్షకు 11 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు.