ఎర్నాకుళం ఆస్పత్రిలో మాస్కులు ధరించిన సిబ్బంది
తిరువనంతపురం: కేరళలో మళ్లీ నిఫా వైరస్ కలకలం సృష్టించింది. కొచిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థికి నిఫా వైరస్ సోకిందని వైద్యులు అనుమానిస్తున్నారు. దానిని ఇంకా నిర్ధారించాల్సి ఉంది. విద్యార్ధికి సంబంధించిన రక్తనమూనాలను పరీక్షల నిమిత్తం పుణెలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ(ఎన్‌ఐవీ)కి పంపినట్లు కేరళ ప్రభుత్వం తెలిపింది. ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని, కాలమస్సరి వైద్యకళాశాల ఆస్పత్రివర్గాలు ఆ విద్యార్థికి ప్రత్యేకవార్డు కేటాయించాయని ఆరోగ్య శాఖ మంత్రి చెప్పారు.
ఎర్నాకుళంకు చెందిన సదరు విద్యార్థి ఇటీవల క్యాంపు నిమిత్తం త్రిశూర్‌కు వెళ్లాడని, ఆ సందర్భంగా అతడికి జ్వరం సోకడంతో ఆసుపత్రిలో చేరాడని జిల్లా వైద్యాధికారి డాక్టర్ రీనా తెలిపారు. ఆ క్యాంపులో 16 మంది విద్యార్థులు ఉన్నారని, అతడితో సన్నిహితంగా ఉన్న ఆరుగురు విద్యార్థులు ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని చెప్పారు. ఏవైనా అనుమానిత కేసులు వస్తే వెంటనే తెలియజేయాలని ప్రైవేట్ ఆసుపత్రులను మంత్రి ఆదేశించారు. కేరళలో గత ఏడాది మే నెలలో నిఫా వైరస్ సోకి 17 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment