
'హామీల అమలులో రాజీపడేది లేదు'
టీఆర్‌ఎస్ ఎంపీ జితేందర్‌రెడ్డి వెల్లడి
ప్రజాస్వామ్యయుతంగా అన్నీ సాధించుకుంటాం
కేంద్రంలో చేరుతామనడం ఊహాగానాలేనని వివరణ
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న అన్ని హామీలను సాధించుకునే విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని టీఆర్‌ఎస్ లోక్‌సభ పక్ష నేత జితేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకునేందుకు అవసరమైన అన్ని అంశాలను పార్లమెంట్‌లో ప్రస్తావిస్తామని చెప్పారు. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు అధ్యక్షతన ఆదివారం మధ్యాహ్నం జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.
తెలంగాణకు కేంద్ర నిధులు తీసుకొచ్చేందుకు అన్ని రకాలుగా కృషి చేస్తామన్నారు. ఇప్పటికే సీఎం కేసీఆర్ మూడుసార్లు ప్రధాని మోదీని కలసి రాష్ట్ర అవసరాలను వివరించారని చెప్పారు. సాధారణ బడ్జెట్, రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత అందులో తెలంగాణకు ఇచ్చిన ప్రాధాన్యాన్ని బట్టి పార్టీ ఎంపీలతో సమీక్షిస్తామన్నారు. సాధారణ బడ్జెట్ ప్రవేశపెట్టాక సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఢిల్లీలో ఓ సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణ డిమాండ్లు నెరవేరకపోతే కేంద్రంపై ఒత్తిడి తెస్తారా అని విలేకరుల అడగగా... ప్రజాస్వామ్యబద్ధంగానే సాధించుకునేలా తగిన వ్యూహంతో ముందుకెళతామని సమాధానమిచ్చారు. అయితే కేంద్ర ప్రభుత్వంలో టీఆర్‌ఎస్ భాగస్వామ్యం కానున్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని, అవన్నీ ఊహాజనితాలేనని జితేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ విషయంపై అసలు ఇప్పటి వరకు చర్చలే జరగలేదని పేర్కొన్నారు.