
‘ఓటుకు కోట్లు’ కేసు.. గవర్నర్ చేతికి!
* విభజన చట్టంలోని సెక్షన్-8ను వినియోగించుకోవచ్చు
* నరసింహన్‌కు అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ సలహా
* ‘ఓటుకు కోట్లు’ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయొచ్చు
* వివాదం తలెత్తకుండా పర్యవేక్షించవచ్చని సూచన
* ఉమ్మడి రాజధానిలో శాంతిభద్రతలపై అధికారం ఉంటుంది
* న్యాయ సలహాలో అటార్నీ జనరల్ వెల్లడించినట్లు సమాచారం
* గవర్నర్ ఎలా స్పందిస్తారనేదానిపై ఉత్కంఠ
* తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం లేదంటున్న న్యాయ నిపుణులు
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్-8 ప్రకారం ఉమ్మడి రాజధానిలో శాంతిభద్రతలపై గవర్నర్‌కు అధికారాలు ఉంటాయని.. దాని ప్రకారం ‘ఓటుకు కోట్లు’ కేసును గవర్నర్ పర్యవేక్షించవచ్చని భారత అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ న్యాయ సలహా ఇచ్చినట్లు సమాచారం. ఈ కేసులో తెలంగాణ ప్రభుత్వం మరింత ముందుకు వెళితే, దానికి ప్రతిగా ఏపీ కేసులు నమోదు చేసి, శాంతిభద్రతలకు ఇబ్బంది కలిగే అవకాశమున్న నేపథ్యంలో... ‘ఓటుకు కోట్లు’ వ్యవహారంపై ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ద్వారా దర్యాప్తు చేయించవచ్చని సూచించినట్లు తెలుస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ‘ఓటుకు కోట్లు’ కేసు దాదాపు మూడు వారాలుగా సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే.
దీనిపై నివేదిక ఇచ్చేందుకు 10 రోజుల క్రితం ఢిల్లీ వెళ్లిన గవర్నర్ నరసింహన్... ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, రాజ్‌నాథ్ తదితరులను కలిశారు. ఏపీ సీఎంపై వచ్చిన ఆరోపణలకు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని, అయితే ఆ కేసులో తెలంగాణ ప్రభుత్వం మరింత ముందుకు వెళితే ఏపీ ప్రభుత్వం కూడా పలు కేసులు పెట్టే పరిస్థితి ఉందని వివరించినట్లు సమాచారం. ఆ పరి స్థితి వస్తే భావోద్వేగాలు రేగి శాంతిభద్రతలు అదుపు తప్పకుండా ఉండేందుకు ఏం చేయాలనే దానిపై చర్చించినట్టు తెలుస్తోంది. దాంతో సెక్షన్-8పై అటార్నీ జనరల్ న్యాయ సలహా తీసుకుని ఆ ప్రకారం ముందుకెళ్లాలని వారు గవర్నర్‌కు సూచించారు. ఈమేరకు అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీని గవర్నర్ న్యాయ సలహా కోరినట్టుగా ఓ న్యాయవాది జాతీయ మీడియా ప్రతినిధి ఒకరి వద్ద ప్రస్తావించినట్టు తెలిసింది.
సెక్షన్-8ను అమలు చేయడం ద్వారా శాంతిభద్రతలపై వచ్చే ప్రత్యేక అధికారంతో సిట్ ఏర్పాటు చేసి ‘ఓటుకు కోట్లు’ కేసును దర్యాప్తు చేయించవచ్చని అటార్నీ జనరల్ సలహా ఇచ్చినట్టు సమాచారం. అలాగే ఉమ్మడి రాజధానిగా ఉన్నం దున హైదరాబాద్‌లో ఏపీ ప్రభుత్వం తమ పోలీ సుల సేవలను విని యోగించుకోవచ్చని తెలిపినట్లు తెలుస్తోంది. అయితే ఈ సలహాను గవర్నర్ స్వీకరిస్తారా, సెక్షన్-8 ద్వారా సంక్రమించే అధికారాలు, బాధ్యతల ద్వారా ‘ఓటుకు కోట్లు’ కేసుపై సిట్ వేస్తారా, దీనిపై తెలంగాణ ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది? వంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఈ సలహాను పాటించాల్సిందేనా?
అటార్నీ జనరల్ (ఏజీ) ఇచ్చి న న్యాయ సలహాను కేంద్రం, గవర్నర్ పాటించాల్సిందేనా? అంటే.. తప్పనిసరి కాదని న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇటీవల సన్ టీవీ నెట్‌వర్క్‌కు సెక్యూరిటీ క్లియరెన్స్ విషయంలో అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ ఇచ్చిన సలహాను కేంద్రం పట్టించుకోలేదు. ‘‘రాజ్యాంగంలోని ఆర్టికల్ 76 ప్రకారం కేంద్రానికి న్యాయ సలహా ఇవ్వడం ఏజీ బాధ్యత. ఈ న్యాయ సలహాను పరిగణనలోకి తీసుకోవాల్సిన ముఖ్యమైన సలహాగా భావిస్తారు. కానీ దానికి కేంద్రం కట్టుబడాలని లేదు. అటార్నీ జనరల్ అభిప్రాయాన్ని మంత్రిత్వ శాఖలు అంతర్గతంగా చర్చించేందుకు పెడతాయి..’’ అని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు.
సెక్షన్-8 ఏం చెబుతోందంటే..
సెక్షన్-8: ఉమ్మడి రాజధానివాసుల రక్షణకు గవర్నర్‌కు గల బాధ్యత
1. అమలు తేదీ నుంచి ఉమ్మడి రాజధాని ప్రాంత పరిపాలనా ప్రయోజనాల కోసం ఆ ప్రాంతంలో నివసించే ప్రజలందరి ప్రాణ రక్షణ, స్వేచ్ఛ, ఆస్తుల పరిరక్షణ కోసం గవర్నర్‌కు ప్రత్యేక బాధ్యత ఉంటుంది.
2. ప్రత్యేకించి శాంతిభద్రతలు, అంతర్గత రక్షణ, ప్రాధాన్యమున్న నిర్మాణాల రక్షణ, ఉమ్మడి రాజధానిలో ప్రభుత్వ భవనాల కేటాయింపు, రక్షణ పై బాధ్యత ఉంది.
3. గవర్నర్ తన విధులు నిర్వహించడంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి మండలిని సంప్రదించి, ఎలాంటి చర్యలు చేపట్టాలనే విషయమై అంతిమంగా తన నిర్ణయాన్ని అమలు జరుపుతారు.
4. కేంద్ర ప్రభుత్వం నియమించే ఇద్దరు సలహాదారులు గవర్నర్‌కు సహాయంగా ఉంటారు.