విచిత్రంగా నోట్లను రద్దు చేస్తారా?: ములాయం
లక్నో: రూ.500, 1000 నోట్ల రద్దు నిర్ణయంపై సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రజలను జైలుకు పంపకుండా ఎమర్జెన్సీ విధించడం అంటే ఇదేనని ఆయన గురువారమిక్కడ అన్నారు. పేదలను, మధ్య తరగతిని హింసించడానికే ఈ నిర్ణయం తీసుకున్నారని ములాయం ధ్వజమెత్తారు.
నోట్ల రద్దు నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేసుకోవాలని, ప్రజలను ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసుకోనివ్వాలని ఆయన సూచించారు. నల్లధనంపై రాంమనోహర్ లోహియా తర్వాత ఎవరైనా పోరాడుతున్నారంటే అది సమాజ్వాది పార్టీయేనని ములాయం అన్నారు. విదేశాల్లోని మొత్తం నల్లధనం వెనక్కి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో నల్లధనం రాకుండా అడ్డుకోవాలన్నారు.
నల్లధనాన్ని వెనక్కి తీసుకురాకుండా విచిత్రంగా నోట్లను రద్దు చేశారని ములాయం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కొందరు పెట్టుబడిదారులకు దేశాన్ని తాకట్టు పెట్టాలని ప్రధాని మోదీ చూస్తున్నారని ఆయన విమర్శించారు. నరేంద్ర మోదీ అర్ధరాత్రి ప్రకటన చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. నల్లధనానికి తాము కూడా వ్యతిరేకులమని చెబుతూనే, ప్రజలను ఇలా ఇబ్బందులు పెట్టాల్సిన ఆగత్యం ఏమొచ్చిందని ఆయన ప్రశించారు. గతంలో విదేశాల నుండి నల్లధనం తీసుకొస్తామని బీజేపీ కోతలు కోసిందని ములాయం విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని ములాయం స్పష్టం చేశారు.
మరోవైపు పెద్ద నోట్ల రద్దుపై బీఎస్పీ అధినేత్రి మాయావతి కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. నోట్ల రద్దు దేశంలో ఎమర్జెన్సీని తీసుకు వచ్చిందని ఆమె వ్యాఖ్యానించారు.