సాక్షి, న్యూఢిల్లీ : భారత్-చైనాల మధ్య వాస్తవాధీన రేఖ వెంబడి పలు ప్రాంతాల్లో నెలకొన్న ప్రతిష్టంభన వారాల తరబడి కొనసాగుతుండటం ఆందోళన రేకెత్తిస్తోంది. సరిహద్దు ఘర్షణలు కాస్తా దళాల మోహరింపునకు దారితీయడం ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను తీవ్రతరం చేస్తున్నాయి. గల్వాన్ లోయలో జూన్ 15న భారత్-చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో 20 మంది భారత జవాన్లు మరణించిన ఘటన అనంతరం ఇరు సైనికాధికారుల చర్చలు సానుకూలంగా సాగినా సరిహద్దుల్లో చైనా దళాల మోహరింపు డ్రాగన్ దుర్నీతిని వెల్లడిస్తోంది. ఇప్పటి ఉద్రిక్తతలు ఇలా ఉంటే జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ 2013లోనే భారత్‌కు వ్యతిరేకంగా చైనా, పాకిస్తాన్‌లు కుట్రకు తెరలేపాయని అప్పటి ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఈశాన్య రాష్ట్రాల్లో ఉగ్రవాద సంస్థలకు ఆయుధాలను సరఫరా చేయడంతో పాటు భారత్‌లో అలజడి రేపేందుకు ఈ రెండు పొరుగు దేశాల కుట్రను అజిత్ దోవల్ ఆనాడే బహిర్గతం చేశారు. ‘చైనా ఇంటెలిజెన్స్ : పార్టీ సంస్థ నుంచి సైబర్ యోధులుగా’ అనే వ్యాసంలో దోవల్ ఈ విషయం ప్రస్తావించారు. చైనా నిఘా వర్గాలు భారత్ సహా పలు దేశాల్లో మాటువేసి తమ దేశం తరపున ప్రణాళికాబద్ధంగా గూఢచర్యం నెరిపిన తీరును ఈ వ్యాసంలో దోవల్ కళ్లకు కట్టారు. ఈ వ్యాసం రాసే సమయంలో ఆయన ఢిల్లీకి చెందిన వివేకానంద అంతర్జాతీయ ఫౌండేషన్‌కు సేవలందించారు. ఆ తర్వాత ఏడాదికి ఎన్డీయే ప్రభుత్వం కొలువుతీరిన క్రమంలో కేంద్రం ఆయనకు జాతీయ భద్రతా సలహాదారుగా కీలక బాధ్యతలను కట్టబెట్టింది. చదవండి : భయపడవద్దు.. మాట ఇస్తున్నా: అజిత్ దోవల్
దోవల్ వెల్లడించిన వివరాల ప్రకారం 1959లో దలైలామా తన 80,000 మంది శిష్యులతో భారత్‌లో ఆశ్రయం పొందిన అనంతరం చైనా భారత్‌పై గూఢచర్య కార్యకలాపాలను వేగవంతం చేసింది. అక్సాయ్‌చిన్ ప్రాంతంలో 219 జాతీయ రహదారిపై లాసా, జిన్‌జియాంగ్‌లను కలుపుతూ చైనా రోడ్డు నిర్మాణాన్ని చేపట్టింది. 1959, నవంబర్ 21న ఐబీ అధికారి కరంసింగ్ చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో కన్నుమూశారు. భారత నిఘా సంస్థలు చైనా కార్యకలాపాలపై ప్రభుత్వానికి సమాచారం చేరవేసినా అప్పటి పాలకులు వాటిపై పెద్దగా దృష్టిసారించలేదని దోవల్ వెల్లడించారు. భారత్‌కు వ్యతిరేకంగా కుట్రపన్నిన చైనా పాక్ నిఘా సంస్థ ఐఎస్‌ఐ సహకారం కూడా తీసుకుందని దోవల్ చెప్పారు. భారత్‌లో ఉగ్రసంస్ధలకు సహకరించేందుకు చైనా పాకిస్తాన్‌లు కలిసి బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఏకంగా ఆపరేషనల్ హబ్‌ను ఏర్పాటు చేశారని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment