ఇరానీ నివాసం వద్ద ఎన్‌ఎస్‌యూఐ నిరసన
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ యూనివర్సిటీలో నాలుగేళ్ల అండర్ గ్రాడ్యుయేట్ కోర్సును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి సంఘం ఎన్‌ఎస్‌యూఐ బుధవారం మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ నివాసం ఎదుట ధర్నా చేసింది. ఢిల్లీ యూనివర్సిటీ నార్త్ క్యాంపస్‌లో నిరాహార దీక్షకు దిగిన ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలను ఢిల్లీ పోలీసులు మంగళవారం రాత్రి ఖాళీ చేయించారు. దాంతో వారు ఎన్‌ఎస్‌యూఐ ప్రధాన కార్యదర్శి మోహిత్ శర్మ నాయకత్వంలో బుధవారం ఉదయం మంత్రి ఇంటి వద్ద నిరసనకు దిగారు. ఉదయం 9.30 గంటలకు అక్కడకు చేరుకున్న కార్యకర్తలు ఓ గంటసేపు నినాదాలు చేశారు. ఓ వైపు విద్యార్థులు, మరోవైపు అధ్యాపక సంస్థలు వరుసగా ఆందోళనలు చేస్తున్నప్పటికీ నాలుగేళ్ల కోర్సుపై ప్రభుత్వం ఎటువంటి చర్య తీసుకోవడం లేదని, దీనిని బట్టి డీయూ వైస్ చాన్సలర్, బీజేపీ కుమ్మక్కైనట్టు తెలుస్తోందని శర్మ ఆరోపించారు. నాలుగేళ్ల కోర్సును రద్దు చేసేంత వరకూ తమ ఆందోళన విరమించబోమని ఎన్‌ఎస్‌యూఐ జాతీయ ప్రతినిధి అమ్రిష్ రంజన్ పాండే అన్నారు.
నార్త్ క్యాంపస్‌లో నిరాహార దీక్ష చేస్తున్న విద్యార్థులను మంగళవారం రాత్రి 11 గంటలకు పోలీసులు ఖాళీ చేయించారు. భారీ సంఖ్యలో వచ్చిన పోలీసు అధికారులు విద్యార్థులను బలవంతంగా నిరాహార దీక్షా స్థలి నుంచి తొలగించారని, నాలుగేళ్ల కోర్సు రద్దు చేయాలని ఎన్‌ఎస్‌యూఐ పట్టుబట్టడంతో ఢిల్లీ యూనివర్సిటీ యంత్రాంగం పోలీసులను రంగంలోకి దింపిందని ఎన్‌ఎస్‌యూఐ పేర్కొంది. ఆరు రోజులుగా నిరశన దీక్షలో ఉన్న ఏడుగురు విద్యార్థులను పోలీసులు బలవంతంగా ఖాళీ చేయించారని ఆరోపించింది. నాలుగేళ్ల కోర్సును రద్దు చేస్తామని బీజేపీ తన ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చిందని, ఆ హామీని నెరవేర్చాలని విద్యార్థి సంఘాలు, ఢిల్లీ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ (డ్యూటా) డిమాండ్ చేస్తున్నాయి. విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటామని మంత్రి స్మృతి ఇరానీ ఏబీవీపీ విద్యార్థుల బృందానికి హామీ ఇచ్చినట్లు తెలిసింది.