
సాక్షి, హైదరాబాద్: జేఈఈ మెయిన్ కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థులారా.. బీ అలర్ట్! ఏప్రిల్‌లో నిర్వహించే జేఈఈ పరీక్ష రాసేందుకు విద్యార్థి ఒకసారి మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. పొరపాటున రెండోసారి రిజిస్ట్రేషన్ చేస్తే అతని మొత్తం దరఖాస్తునే తిరస్కరిస్తామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) స్పష్టం చేసింది. ఈ మేరకు కొత్త నిబంధ నను ఎన్టీఏ వెలువరించింది. ఆన్‌లైన్ దరఖాస్తుల్లో పొరపాట్ల సవరణకు అవకాశం ఉంటుందని.. ఈ అవకాశాన్ని మాత్రమే వినియోగించుకోవాలని సూచించింది. ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీ, ప్రభుత్వ ఆర్థిక సహాయంతో కొనసాగే విద్యా సంస్థల్లో (జీఎఫ్‌టీఐ) ప్రవేశాల కోసం నిర్వహించే రెండో దఫా జేఈఈ మెయిన్ దరఖాస్తులను ఈనెల 8వ తేదీన ప్రారంభించిన సంగతి తెలిసిందే.
వచ్చే నెల 7వ తేదీ వరకు విద్యార్థులు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్, దరఖాస్తుల సబ్‌మిషన్, 8వ తేదీ వరకు ఫీజు చెల్లింపునకు అవకాశం కల్పించింది. దీంతో విద్యార్థులు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. గతంలో.. రిజిస్ట్రేషన్ సమయంలో ఒకసారి ఏమైనా పొరపాట్లు దొర్లితే మళ్లీ రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉండేది. అయితే ఈసారి ఆ అవకాశాన్ని తొలగిస్తూ.. రెండోసారి దరఖాస్తు చేసుకుంటే ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే మొత్తం దరఖాస్తునే తిరస్కరిస్తామని వెల్లడించింది.