పుస్తకాలు, పెన్సిల్ లాంటి చిన్న చిన్న వస్తువులు కొనేందుకు కూడా వెంటనే డబ్బులు ఇవ్వలేని తల్లిదండ్రుల నిస్సహాయత.. ఓ చిన్నారి ప్రాణాలు తీసింది. రోజుకూలీగా పనిచేసే తండ్రి బిజోయ్ నాయక్.. ఇటీవల పక్షవాతం రావడంతో పనిలోకి వెళ్లలేకపోగా, మందుల ఖర్చు మరింతగా ఆ కుటుంబంపై పడింది. కుటుంబానికి నాలుగు మెతుకులు నోట్లోకి వెళ్లడానికి తల్లి ఈశ్వరి నాలుగు ఇళ్లలో పనిమనిషిగా చేస్తోంది.
ఒడిషాలోని గంజాం జిల్లా ఆస్కా పట్టణానికి చెందిన ఈ పేద కుటుంబంలోని పెద్ద కుమార్తె జయంతి (14) ఇటీవలే ఏడో తరగతిలోకి వచ్చింది. తనకు పెన్సిళ్లు, పుస్తకాలు, ఇతర స్టేషనరీ సామగ్రి కొనివ్వాలని తల్లిదండ్రులను అడిగింది. అయితే, తమవద్ద ప్రస్తుతం అంత డబ్బు లేదని, కొన్నాళ్లు ఆగితే కొనిస్తామని వారు చెప్పారు. దీంతో ఏమీ లేకుండా స్కూలుకు వెళ్లడం అవమానంగా భావించిన ఆ చిన్నారి.. తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. ఇరుగుపొరుగు వారు ఆమె కేకలు విని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే 50 శాతానికి పైగా కాలిన గాయాలైన ఆమె.. చికిత్స పొందుతూ మరణించింది.
పెన్సిల్, పుస్తకం ఇవ్వలేదని విద్యార్థిని ఆత్మహత్య
Published Thu, Jun 26 2014 2:56 PM | Last Updated on Sat, Sep 15 2018 7:15 PM
Advertisement