
డాలర్ డ్రీమ్స్
రైలు పాతదే.. కలలు కొత్తవి
విదేశీ పెట్టుబడులకు ద్వారాలు తెరిచిన భారతీయ రైల్వే
నిర్వహణ విభాగంలో మాత్రం ఎఫ్‌డీఐలు ఉండవు
దేశీయ ప్రైవేటు పెట్టుబడులకూ మోడీ సర్కారు ఆహ్వానం
సదానందగౌడ రైల్వే బడ్జెట్‌లో ప్రయాణికులకే పెద్దపీట
న్యూఢిల్లీ: నెల రోజుల కిందటే కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ సర్కారు.. రైల్వేలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు పచ్చజెండా ఊపింది. రైల్వే మౌలిక వసతులకు ఎఫ్‌డీఐలను ఆహ్వానిస్తామని, స్వదేశీ ప్రైవేటు పెట్టుబడులకూ అనుమతిస్తామని స్పష్టంచేసింది. కీలక ప్రాజెక్టుల్లో ప్రభుత్వ - ప్రైవేటు భాగస్వామ్యాన్నీ (పీపీపీని) పెంచుతామని తొలి రైల్వే బడ్జెట్‌లో ప్రకటించింది. రైల్వేమంత్రి సదానందగౌడ తన తొలి రైల్వే బడ్జెట్‌ను మంగళవారం పార్లమెంటుకు సమర్పించారు. రికార్డు స్థాయిలో రూ.1,64,374 కోట్లతో రూపొందించిన రైల్వే బడ్జెట్‌లో.. ఊహించినట్లే ప్రయాణికుల సౌకర్యాలు, భద్రతా చర్యలు, పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచటానికి, రైల్వేల ఆధునీకరణకు ప్రాధాన్యమిచ్చారు. కానీ.. ప్రజాకర్షక ప్రకటనలేవీ చేయలేదు. ప్రధాని నరేంద్రమోడీ సొంత రాష్ట్రం గుజరాత్‌లోని అహ్మదాబాద్ - మహారాష్ట్రలోని ముంబై మధ్య ఒక బుల్లెట్ రైలు, ప్రధాన మెట్రో నగరాలను కలుపుతూ హై స్పీడ్ వజ్ర చతుర్భుజి రైల్వే వ్యవస్థ, తొమ్మిది సెక్టార్లలో రైళ్ల వేగాన్ని గంటకు 200 కిలోమీటర్ల వరకూ పెంచటం, దేశవ్యాప్తంగా 58 కొత్త రైళ్లు ప్రవేశపెట్టటం, మరో 11 రైళ్ల ప్రయాణదూరం పొడిగింపు. ఇవీ ఈ బడ్జెట్‌లోని ముఖ్యాంశాలు. పక్షం రోజుల కిందటే భారీగా రైలు ప్రయాణ చార్జీలు, సరుకు రవాణా చార్జీలను వడ్డించిన నేపథ్యంలో ఈ బడ్జెట్లో ఎలాంటి చార్జీలపెంపూ లేదు. అయితే ప్రతి ఆరు నెలలకొకసారి అంతర్జాతీయ ఇంధన ధరలకు అనుగుణంగా రైలు చార్జీలను సమీక్షించి సవరించాలని గతంలో పార్లమెంటు నిర్ణయించిందని, దానిని కొనసాగిస్తామని రైల్వేమంత్రి చెప్పారు. మంగళవారం మధ్యాహ్నం 12:10 గంటలకు తొలుత లోక్‌సభలో బడ్జెట్ ప్రసంగం ప్రారంభించిన సదానందగౌడ.. తను ప్రతిపాదించిన బుల్లెట్ రైలు, హైస్పీడ్ రైలు తరహాలోనే వేగంగా ప్రసంగాన్ని చదువుతూ పోయారు. రైల్వేలోకి ఎఫ్‌డీఐ, ప్రైవేటు పెట్టుబడులను ఆహ్వానిస్తామని గౌడ ప్రకటించినపుడు.. ఇది అంబానీలు, అదానీల బడ్జెట్ అంటూ విపక్షాలు నిరసించాయి.
ప్రాజెక్టులన్నీ పెండింగే...
రైల్వే రంగం ఏళ్ల తరబడి నిర్లక్ష్యానికి గురయిందని, ప్రజాకర్షణ మోజులో పడి రైల్వేను తీవ్ర నిధుల కొరతలోకి నెట్టివేశారని గత ప్రభుత్వాలపై గౌడ విమర్శలు ఎక్కుపెట్టారు. సభలో చప్పట్ల కోసం, ఓట్ల కోసం ఎప్పటికప్పుడు ఎన్నో కొత్త ప్రాజెక్టులు ప్రకటిస్తూ వచ్చారని.. కానీ నిధుల కొరత కారణంగా ఆ ప్రాజెక్టులేవీ సకాలంలో పూర్తికావటం లేదని ఎండగట్టారు. గత 30 ఏళ్లలో రూ.1,57,883 కోట్ల వ్యయం కాగల 676 కొత్త ప్రాజెక్టులకు అనుమతులు ఇస్తే.. ఇప్పటికి 317 ప్రాజెక్టులు మాత్రమే పూర్తయ్యాయన్నారు. మిగిలినవి పూర్తిచేయటానికి ఇప్పుడు రూ.1,82,000 కోట్లు అవసరమవుతాయని చెప్పారు. అలాగే గత పదేళ్లలో రూ. 60,000 కోట్ల విలువైన 99 కొత్త రైల్వే లైన్లకు అనుమతులివ్వగా.. అందులో ఇప్పటివరకూ పూర్తయింది ఒక్కటేనని చెప్పారు.
కిలోమీటరుకు 23 పైసలు నష్టం
ప్రయాణ చార్జీలను చాలా కాలంగా సవరించకుండా వదిలివేశారని.. దీనివల్ల 2012-13 నాటికి ఒకో ప్రయాణికుడిపై కిలోమీటరుకు 23 పైసల నష్టంవస్తోందని మంత్రి చెప్పారు. ఆ నష్టాన్ని భర్తీ చేసుకోవటానికి సరుకు రవాణా చార్జీలను పెంచేయటంతో రవాణాదారులు దూరమవుతున్నారని.. సరుకు రవాణాలో రైల్వేల వాటా గత 30 ఏళ్లలో క్రమంగా తగ్గిపోతూ వస్తోందన్నారు. అందుకే కఠినమైనప్పటికీ చార్జీల పెంపు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. గత నెల 25వ తేదీ నుంచి అమలులోకి వచ్చిన చార్జీల పెంపుతో రూ. 8,000 కోట్ల అదనపు ఆదాయం వస్తుందన్నారు. అయితే.. వజ్ర చతుర్భుజి వ్యవస్థను పూర్తిచేయటానికి రూ.9 లక్షల కోట్లకన్నా ఎక్కువ నిధులు అవసరమవుతాయన్నారు. ఒక్క బుల్లెట్ రైలును ప్రవేశపెట్టటానికి రూ. 60,000 కోట్లు ఖర్చవుతుందన్నారు. అందుకే నిధుల సమీకరణకు ప్రత్యామ్నాయ మార్గాలను ఆన్వేషించానని తెలియజేశారు.
రికార్డు స్థాయి రైల్వే ప్రణాళిక...
2014-15లో రూ.1,64,374 కోట్ల రాబడిని అంచనా వేశారు. దీన్లో సరుకు రవాణా ఆదాయం రూ.1,05,770 కోట్లు, ప్రయాణ చార్జీల ఆదాయం రూ. 44,645 కోట్లు. దీన్లో రూ.1,49,176 కోట్లు అంచనా వ్యయంకాగా.. సాధారణ నిర్వహణ వ్యయం 1,12,649 కోట్లు. ఇది గత ఆర్థిక సంవత్సరం కన్నా రూ. 15,078 కోట్లు ఎక్కువ. ఇంధన ధరలు పెరగటం, సిబ్బంది వ్యయం పెరగటం వల్ల నిర్వహణా వ్యయం పెరిగనట్లు గౌడ చెప్పారు.
ఈ ఆర్థిక సంవత్సరానికి రికార్డు స్థాయిలో రూ. 65,445 కోట్ల ప్రణాళికా వ్యయాన్ని ప్రకటించారు. ఇందులో రూ. 30,000 కోట్లకు పైగా బడ్జెటరీ మద్దతుగా కేంద్రం అందిస్తుంది. మార్కెట్ అప్పుల ద్వారా రూ. 11,790 కోట్లు, అంతర్గత వనరులు రూ. 15,350 కోట్లు, పీపీపీల ద్వారా 6,005 కోట్లు సమీకరిస్తారు. బడ్జెట్‌లో పెన్షన్ చెల్లింపుల కోసం రూ. 28,850 కోట్లు, డివిడెండ్ చెల్లింపుల కోసం రూ. 9,135 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. రైల్వే ఆర్జిస్తున్న ప్రతి రూపాయిలో 94 పైసలను రైల్వే కోసమే వెచ్చిస్తున్నట్లు పేర్కొన్నారు.
రైల్వేల్లోకి విదేశీ పెట్టుబడులు...
రైల్వే ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ఆర్థికంగా బలంగా ఉన్నాయని, వీటి నుంచి అదనపు నిధులను రైల్వే ఇన్‌ఫ్రా ప్రాజెక్టుల్లోకి పెట్టుబడులుగా తెచ్చేందుకు ఒక పథకాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. అవసరమైన నిధుల కోసం రైల్వేలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను(ఎఫ్‌డీఐ) అనుమతించేందుకు కేంద్ర కేబినెట్ అనుమతి కోరుతున్నట్లు చెప్పారు. భవిష్యత్తులో రైల్వే ప్రాజెక్టుల్లో అత్యధిక భాగం పీపీపీ (ప్రభుత్వ - ప్రయివేటు భాగస్వామ్యం) పద్ధతిలో చేపడతామన్నారు. భారీ మొత్తంలో పెట్టుబడులు అవసరమైన హైస్పీడ్ రైళ్లకు కూడా ఇదే పద్ధతిని అవలంబిస్తామన్నారు.
రాబడి తగ్గింది..
2013-14 ఆర్థిక సంవత్సరంలో స్థూల రవాణా వసూళ్లు రూ. 1,39,558 కోట్లుగా ఉన్నట్లు మంత్రి తెలిపారు. ఇది సవరించిన అంచనాలకన్నా రూ. 942 కోట్లు తక్కువ. మరోవైపు సాధారణ నిర్వహణ వ్యయం రూ. 97,571 కోట్లకు చేరిందని.. ఇది సవరించిన అంచనా కన్నా రూ. 511 కోట్లు ఎక్కువని వివరించారు. అలాగే.. పెన్షన్ చెల్లింపులు కూడా పెంచాల్సి వచ్చిందన్నారు. ఫలితంగా గత ఆర్థిక సంవత్సరంలో అంచనా వేసిన రూ. 7,943 కోట్లు మిగులు.. వాస్తవానికి రూ. 3,783 కోట్లకు పడిపోయిందని తెలిపారు. ఇక ప్రణాళికా వ్యయం కూడా సవరించిన అంచనాలు రూ. 59,359 కోట్ల కన్నా తగ్గిపోయిందని.. పీపీపీ లక్ష్యాలు వాస్తవరూపం దాల్చకపోవటమే దీనికి కారణమని పేర్కొన్నారు.
ప్రయాణికుల భద్రత, సేవలకు ప్రాధాన్యం
ప్రధాన రైల్వేస్టేషన్లలో ఫుట్-ఓవర్ బ్రిడ్జిలు, ఎస్కలేటర్లు, లిఫ్టుల ఏర్పాటు; వికలాంగులు, వృద్ధుల కోసం బ్యాటరీలతో నడిచే చక్రాల కుర్చీలు; రైళ్లలో వై-ఫై, కంప్యూటర్లతో వర్క్ స్టేషన్ల ఏర్పాటు, రైళ్లలో పరిశుభ్రమైన ఆహారం సరఫరా, రైల్వేస్టేషన్లలో ఫుడ్ కోర్టుల ఏర్పాటు, ఈ-టికెట్ బుకింగ్ సౌకర్యాల విస్తరణ వంటి చర్యలను రైల్వే మంత్రి ప్రకటించారు. స్టేషన్లలో సీసీటీవీల ఏర్పాటు, ఆర్‌వో తాగునీటి యూనిట్ల ఏర్పాటు, రైళ్లలో బయో టాయిలెట్లు, పారిశుద్ధ్య సిబ్బంది మరిన్ని రైళ్లకు విస్తరణ వంటి చర్యలు చేపడతామన్నారు. వీటన్నిటిలో పీపీపీ పద్ధతిని అనుసరించటంతో పాటు ఎన్‌జీఓలు, సామాజిక సంస్థలు, కార్పొరేట్ సంస్థలను భాగస్వాములను చేస్తామన్నారు. భద్రతకోసం దేశవ్యాప్తంగా రైల్వే ట్రాక్‌ల పునరుద్ధరణ, కాపలా లేని లెవల్ క్రాసింగ్‌ల తొలగింపు, రోడ్ ఓవర్ బ్రిడ్జిలు, రోడ్ అండర్ బ్రిడ్జిల నిర్మాణాల కోసం రూ. 40,000 కోట్లు అవసరమవుతాయని మంత్రి చెప్పారు. ఈ బడ్జెట్‌లో వీటికి 1,785 కోట్లు కేటాయించినట్లు చెప్పారు.
ప్రయాణికుల భద్రత కోసం ఆటోమేటిక్‌గా తలుపులు మూసుకునే బోగీలను పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభిస్తామన్నారు. అలాగే.. 4,000 మంది మహిళా ఆర్‌పీఎఫ్ కానిస్టేబుళ్లను నియమిస్తామని, మహిళా బోగీల్లో వీరితో భద్రత కల్పిస్తామని చెప్పారు. రైలు టూరిజం, రైల్వే రిజర్వేషన్ వ్యవస్థ మొత్తం పునర్‌వ్యవస్థీకరణ, రైల్వే ఉద్యోగుల సంక్షేమం తదితర అంశాలపై పలు చర్యలను బడ్జెట్‌లో ప్రకటించారు. సిబ్బంది సంక్షేమ నిధి, రైల్వే యూనివర్సిటీ ఏర్పాటు చేపడతామన్నారు. హైస్పీడ్ వజ్ర చతుర్భుజి ప్రాజెక్టుకు రూ. 100 కోట్లు కేటాయించారు. అలాగే.. తొమ్మిది ఎంపిక చేసిన సెక్టార్లలో రైళ్ల వేగాన్ని గంటకు 160 కిలోమీటర్ల నుంచి 200 కిలోమీటర్ల వరకూ పెంచుతామన్నారు.