పదోవంతు కంటే తక్కువ బలమే కారణం
న్యూఢిల్లీ: కాంగ్రెస్‌కు ప్రతిపక్ష నేత హోదా కొత్తగా బాధ్యతలు స్వీకరించనున్న స్పీకర్ నిర్ణయంపైనే ఆధారపడనుంది. సార్వత్రిక ఎన్నికల్లో దారుణ పరాజయాన్ని చవిచూసిన కాంగ్రెస్, కేవలం 44 సీట్లు మాత్రమే.. అంటే, మొత్తం 545 మంది సభ్యుల లోక్‌సభలో పది శాతానికంటే తక్కువ సీట్లు సాధించడం తెలిసిందే. బీజేపీ 282 స్థానాలు సాధించగా, 44 స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్ రెండో అతిపెద్ద పార్టీగా నిలిచింది. ప్రతిపక్ష హోదాకు సంబంధించి రెండు చట్టాలు , ‘లోక్‌సభ స్పీకర్ మార్గదర్శకాలు’ పుస్తకం ఉన్నాయి. పార్లమెంటులో గుర్తింపు పొందిన పార్టీలు, కూటముల నేతలు, చీఫ్ విప్‌ల చట్టం ప్రకారం 55 మందికి తక్కువ కాకుండా సభ్యులున్న ప్రతి పార్టీని గుర్తింపు పొందిన పార్టీగా పరిగణిస్తారని ఒక అధికారి తెలిపారు.
ప్రతిపక్ష నేతల వేతనం, అలవెన్సుల చట్టం కింద విపక్షాల్లో అత్యధిక సంఖ్యలో సభ్యులున్న పార్టీకి నేతగా ఉన్న వ్యక్తిని ప్రతిపక్ష నేతగా స్పీకర్ గుర్తిస్తారు. ఈ గుర్తింపు లభించిన నేతకు కేబినెట్ మంత్రితో సమానమైన సౌకర్యాలన్నీ లభిస్తాయి. ప్రతిపక్ష నేతను గుర్తించేందుకు కేవలం ప్రతిపక్ష నేతల వేతనం, అలవెన్సుల చట్టాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోరాదని, మరింత సమగ్రంగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని నిపుణులు అభిప్రాయపడుతున్నట్లు వెల్లడించారు. అయితే, ఈ అంశంపై కొత్త స్పీకరే తుది నిర్ణయం తీసుకుంటారన్నారు.
స్పీకర్ నిర్ణయంపైనే కాంగ్రెస్‌కు విపక్ష నేత హోదా
Published Tue, May 20 2014 1:52 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
Advertisement
Advertisement