రాజ్‌నాథ్ తనయుడిపై వివాదం
* దిద్దుబాటు చర్యల్లో బీజేపీ, పీఎంఓ
* రాజ్‌నాథ్ కుమారుడిపై ప్రధాని ఆగ్రహం అంటూ మీడియాలో వార్తలు
* అవన్నీ పచ్చి అబద్ధాలంటూ పీఎంఓ వివరణ
* రుజువు చేస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా: రాజ్‌నాథ్
న్యూఢిల్లీ: కేంద్ర హోంమంత్రి, రాజ్‌నాథ్ సింగ్ కుమారుడిపై వచ్చిన ఆరోపణల వ్యవహారం బుధవారం రాజకీయ దుమారంగా మారింది. రాజ్‌నాథ్ కుమారుడు పంకజ్ సింగ్ వ్యవహార శైలిపై ప్రధాని నరేంద్రమోడీ ఆగ్రహంగా ఉన్నారని, అవినీతి ఆరోపణలపై పంకజ్‌ను మందలించారని, దీనిపై రాజ్‌నాథ్ వివరణ ఇచ్చారని మీడియాలో వార్తలు సంచలనంగా మారాయి. దీంతో దిద్దుబాటు చర్యలు ప్రారంభించిన రాజ్‌నాథ్‌సింగ్, ప్రధాని కార్యాలయం, బీజేపీలు బుధవారం వేర్వేరుగా వివరణలు ఇచ్చాయి.
తన కుమారుడి ప్రవర్తనకు సంబంధించి వచ్చిన ఆరోపణలను రాజ్‌నాథ్ తీవ్రంగా ఖండించారు. తనపై, తన కుటుంబ సభ్యులపై వచ్చిన ఆరోపణలను ఏ మాత్రం రుజువుచేసినా రాజకీయాల నుంచి తప్పుకుని ఇంట్లో కూర్చుంటానని ఘాటుగా స్పందించారు. నార్త్‌బ్లాక్‌లోని తన కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరణ ఇచ్చారు. ఈ విషయంపై ప్రధానితో, పార్టీ అధ్యక్షుడు అమిత్ షాతో మాట్లాడానని, వారు కూడా ఆ వార్తలను ఖండించారన్నారు.
పార్టీలో, మంత్రివర్గంలో తనకు ప్రత్యర్థిగా ఉన్న ఒక సీనియర్ నేతే ఈ వదంతులను వ్యాపింపజేస్తున్నారని రాజ్‌నాథ్ ఆగ్రహంగా ఉన్నారన్న వార్తలపై ప్రశ్నించగా.. ఆ విషయాన్ని జర్నలిస్టులుగా మీరే కనుక్కోవాలని వ్యాఖ్యానించారు. అదే సమయంలో ప్రధాని కార్యాలయం(పీఎంఓ) నుంచి కూడా ఒక ప్రకటన వచ్చింది. రాజ్‌నాథ్ కుమారుడికి సంబంధించి మీడియాలో వస్తున్న వార్తలు పచ్చి అబద్ధాలని అందులో పేర్కొన్నారు. అవన్నీ ప్రభుత్వ ఇమేజ్‌ను దెబ్బతీసేందుకు చేస్తున్న కుట్రపూరిత ప్రయత్నాలు గా పీఎంఓ అభివర్ణించింది. బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా కూడా రాజ్‌నాథ్‌కు బాసటగా నిలిచారు. రాజ్‌నాథ్ కుమారుడిపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తున్నానన్నారు. సెప్టెంబర్ 13న జరగనున్న యూపీ ఉప ఎన్నికల్లో నోయిడా నుంచి పోటీ చేయాలని ఆశించిన పంకజ్‌కు పార్టీ టికెట్ నిరాకరించడం గమనార్హం. 2012 ఎన్నికల్లోనూ ఆయనకు అవకాశం ఇవ్వలేదు.
విషయమేంటో చెప్పండి!
ఈ అంశాన్ని ప్రతిపక్షాలు బీజేపీపై, మోడీ ప్రభుత్వంపై చురకలేసాయి. రాజ్‌నాథ్ కుమారుడిపై వచ్చిన ఆరోపణలేంటో చెప్పాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అజయ్ మాకెన్ వ్యాఖ్యానించారు. ‘ప్రతిపక్ష పార్టీగా మేమైతే ఎలాంటి ఆరోపణలు చేయలేదు. మరి మీరు ఏ ఆరోపణలపై వివరణ ఇస్తున్నారు? అసలు ఆరోపణలు చేసింది ఎవ రు? మీ కుమారుడిపై వచ్చిన ఆరోపణలేమిటో తెలుసుకోవాలని కాంగ్రెస్, దేశప్రజలు కోరుకుంటున్నార’ని అన్నారు. రాజ్‌నాథ్ కుటుంబసభ్యులపై వదంతులు ఎవరు వ్యాప్తి చేస్తున్నారో పీఎంఓ స్పష్టం చేయాలని వామపక్షాలు కోరాయి. కాగా, జేడీయూ, సమాజ్‌వాదీ పార్టీలు రాజ్‌నాథ్‌కు మద్దతుగా నిలిచాయి.
ఇంతకీ వివాదమేంటి?
బీజేపీ వర్గాల సమాచారం మేరకు అంటూ రాజ్‌నాథ్‌సింగ్ కుమారుడికి సంబంధించి మీడియాలో వస్తున్న వార్తలే వివాదానికి కారణాలయ్యాయి. ఆ వార్తల ప్రకారం ‘యూపీలో బీజేపీ నేతగా ఉన్న పంకజ్‌సింగ్.. పోలీసు నియామకాలకు సంబంధించి డబ్బులు తీసుకున్నారన్న విషయం మోడీ వరకు వచ్చింది. మోడీ రాజ్‌నాథ్‌ను, పంకజ్‌ను తన చాంబర్‌కు పిలిపించుకుని. పంకజ్‌ను ప్రశ్నించారు. ఆయనను మందలించారు. పోలీసు నియామకాలకు తీసుకున్న డబ్బులను తిరిగిచ్చేయాలంటూ ఆదేశించారు. మోడీ చాంబర్ నుంచి రాజ్‌నాథ్, పంకజ్‌లు తిరిగి వెళ్తున్న సమయంలోనూ.. మరోసారి ఇలాంటి ఫిర్యాదులు రాకుండా చూసుకోవాలని పంకజ్‌ను హెచ్చరించారు.’ మీడియాలో వచ్చిన ఈ వివాదం వెనుక రాజ్‌నాథ్ అంటే గిట్టని, ఆ హోదాను ఆశిస్తున్న ఓ సీనియర్ నేత ఉన్నారని ఆయన మద్దతుదారులు చెబుతున్నారు.