చిన్నమ్మకు నేను వీరవిధేయుడిని- పన్నీర్ సెల్వం
సాక్షి, చెన్నై: తమిళనాడులో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ కల్లోలం నేపథ్యంలో డిప్యూటీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఈ ప్రకటన ఇచ్చాడంటే నమ్మటం కాస్త కష్టమే. అయితే అమ్మ నిష్క్రమణ తర్వాత అన్నాడీఎంకే పార్టీపై పట్టు సాధించి ముఖ్యమంత్రి పదవిలో కూర్చుని ఏకఛత్రాధిపత్యంతో ఏలుదామనుకున్న శశికళకు పన్నీర్ అండ్ కో ఇచ్చిన ఝలక్ ఏపాటితో తెలిసిందే. జయ సమాధి దగ్గర మొదలైన డ్రామా చివరకు చిన్నమ్మను జైలుకు పంపాక కూడా కొనసాగుతూనే వస్తోంది. ఈ నేపథ్యంలో గతంలో పన్నీర్ సెల్వం ఆమె గురించి మాట్లాడిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
జయలలిత మరణానంతరం ప్రధాన కార్యదర్శిగా వీ శశికళను ఏకగ్రీవంగా ఎన్నుకుంది పార్టీ. కొద్దిరోజులకే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించారు కూడా. ఈ సందర్భంలో సాక్షాత్తూ అసెంబ్లీ సాక్షిగా... పన్నీర్ సెల్వం మాట్లాడిన మాటలు... ‘కోటి యాభై లక్షల పార్టీ కార్యకర్తల్లో నేను ఒకడినే. పార్టీ ప్రధాన కార్యదర్శి చిన్నమ్మ(శశికళ) అన్నా.. ఆమె నిర్ణయాలు అన్నా.. ఎంతో గౌరవం ఉంది’ . మరి అదే ఓపీఎస్ తర్వాత ధర్మయుద్ధం అంటూ భారీ డైలాగులతో తిరుగుబాటును ఎగరవేశారు.
ఈయనతోపాటు విద్యాశాఖ మంత్రి సెంగోట్టైయాన్, మంత్రులు సెల్లూర్ రాజు, ఆర్ బీ ఉదయ్‌కుమార్, వెలమంది నటరాజన్, మరో కీలక నేత జయకుమార్... వీరంతా శశిళ, దినకరన్‌లపై పొగడ్తలు గుప్పించి.. ఇప్పుడు ఓ రేంజ్‌లో విమర్శలు చేస్తున్న వారే. ప్రస్తుతం ఇరు వర్గాల మధ్య ఏమేర విమర్శలు కొనసాగుతున్నాయో తెలిసిందే. ఈ నేపథ్యంలో వీడియో వైరల్ అవుతుండగా.. చూసిన వాళ్లంతా... అరవ రాజకీయాల్లో అతి తెలియందా? అంటూ కామెంట్లు పెడుతున్నారు. అందితే జుట్టు.. అందకపోతే కాళ్లు... ఏదైనా అధికారం కోసమే కదా!