ముంబై: పలు పథకాలకు ప్రభుత్వం ఆధార్‌ను తప్పనిసరి చేయడంపై కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్‌ఆర్.నారాయణమూర్తి మధ్య ఆసక్తికరమైన సంవాదం నడిచింది. ఐఐటీ బాంబే శుక్రవారం నాడిక్కడ ఏర్పాటుచేసిన కార్యక్రమానికి వీరిద్దరూ హాజరయ్యారు. సమావేశంలో తొలుత చిదంబరం మాట్లాడుతూ.. ఎలాంటి సహేతుక కారణం లేకుండా ప్రతీదానికి ఆధార్‌ను అనుసంధానం చేస్తూ కేంద్రం గుడ్డిగా వ్యవహరిస్తోందన్నారు. ‘వివాహం కాని ఓ యువజంట ఏకాంతంగా గడపాలనుకుంటే తప్పేంటి? ఓ యువకుడు కండోమ్స్ కొనాలంటే ఆధార్ లేదా మరో గుర్తింపు కార్డును చూపించాల్సిన అవసరమేంటి? నేనేం మందులు కొంటానో, ఏ సినిమాలు చూస్తానో, ఏయే హోటళ్లకు వెళ్తానో ప్రభుత్వం తెల్సుకోవాల్సిన అవసరం ఏమిటి?’ అని ప్రశ్నించారు.
దీంతో చిదంబరం వ్యాఖ్యలతో తాను విభేదిస్తున్నట్లు మూర్తి ప్రకటించారు. చిదంబరం చెప్పిన వివరాలన్నీ గూగుల్‌లోనే లభ్యమవుతున్నాయన్నారు. చిదంబరం మాట్లాడుతూ.. బ్యాంక్ ఖాతాను తానింతవరకు ఆధార్‌తో లింక్ చేసుకోలేదన్నారు. దేశంలో ఆధార్ అనుసంధానం స్వచ్ఛందంగా జరగటంలేదని, ప్రజల్ని ఎస్సెమ్మెస్‌లు, ఈ–మెయిళ్లతో బెదరగొడుతున్నారన్నారు. పథకాల అమలు, సబ్సిడీల కోసం ఆధార్ వినియోగానికి తాను వ్యతిరేకం కాదన్నారు. మూర్తి స్పందిస్తూ ఆధార్ వివరాలు దుర్వినియోగం కాకుండా చట్టం చేయాల్సిన బాధ్యత పార్లమెంటుదేనన్నారు. వ్యక్తిగత గోప్యతకు తగిన రక్షణ తీసుకుంటే ఆధార్ కూడా డ్రైవింగ్ లైసెన్సులాగా ఓ గుర్తింపు పత్రంగా ఉంటుందని మూర్తి అభిప్రాయపడ్డారు. సినిమా టికెట్ ఇతర వినోద కార్యక్రమాలకు ఆధార్ కోరాలనడం సరైంది కాదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment