
'అప్పటివరకూ సభకు హాజరు కావొద్దు'
న్యూఢిల్లీ : ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ భగవంత్ సింగ్ మన్ లోక్సభకు హాజరుపై స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆంక్షలు విధించారు. పార్లమెంట్లో దృశ్యాలను లైవ స్ట్రీమింగ్ చేసిన భగవంత్ వ్యవహారంపై స్పీకర్ సోమవారం 9మంది సభ్యులతో ఓ కమిటీని ఏర్పాటు చేశారు. ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై ఆగస్టు 3లోగా నివేదిక ఇవ్వాలని స్పీకర్... ఆ కమిటీకి సూచించారు. కాగా, విచారణ కమిటీ నివేదిక వచ్చేంతవరకూ సభకు హాజరు కావద్దని స్పీకర్ ఈ సందర్భంగా భగవంత్ మన్ను ఆదేశించారు. ఈ వ్యవహారాన్ని క్షమాపణతో సరిపెట్టడం కుదరదని స్పష్టం చేశారు.
కాగా భగవంత్ మన్ పార్లమెంటు భద్రత వీడియోను చిత్రీకరించి సామాజిక మాధ్యమంలో పోస్టు చేయటంపై పార్లమెంటు ఉభయ సభల్లో తీవ్రగందరగోళం నెలకొన్న విషయం తెలిసిందే. పార్లమెంటు భద్రతపై తీసిన వీడియో వివాదాన్ని సీరియస్‌గా తీసుకుని మన్‌పై కఠినమైన చర్యలు తీసుకోవాలని పార్టీలన్నీ డిమాండ్ చేశాయి. మరోవైపు తను తీసిన వీడియో దుమారం రేపుతుండటంత మన్ బేషరతు క్షమాపణ కోరారు.
అసలు వీడియోలో ఏముంది?
12 నిమిషాల నిడివి ఉన్న వీడియోలో.. భగవంత్ మన్ పార్లమెంటు ఆవరణలోకి అడుగుపెడుతున్నప్పటి నుంచి వివిధ అంచెల భద్రతను దాటుతూ ఎలా లోపలిదాకా వెళ్లాలో ఆ వీడియోలో చూపించారు. ‘మీరు గతంలో ఎప్పుడూ చూడనిది ఇవాళ చూడబోతున్నారు’ అని స్వయంగా అన్నారు. పార్లమెంటు ప్రశ్నోత్తరాల సమయం ఎలా ఉంటుందో రికార్డు చేశారు. దీన్ని సామాజిక మాధ్యమంలో పోస్టు చేశారు. దీనిపై వివాదం రేగటంతో.. ఫేస్‌బుక్ వాల్‌నుంచీ ఆ వీడియోను తొలగించినట్లు మన్ తెలిపారు.