జైలు నుంచి బయటకొచ్చిన పప్పు యాదవ్
పట్నా: బీజేడీ బహిష్కృత నేత జనాధికార్ పార్టీ వ్యవస్థాపకుడు రాజేశ్ రంజన్ అలియాస్ పప్పు యాదవ్ జైలు నుంచి విడుదలయ్యాడు. 25 రోజులపాటు బియుర్ జైలులో గడిపిన ఆయన పట్నా హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో శుక్రవారం విడుదలయ్యాడు. ఈ సందర్భంగా జైలు వెలుపల ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. మిఠాయిలు పంచుకున్నారు. మాదేపురా నుంచి ఎంపీగా పనిచేస్తున్న పప్పును శాంతిభద్రతలకు భంగంకలిగించాడనే కేసులో పోలీసులు మార్చి 27న అరెస్టు చేశారు.
ప్రస్తుతం విడుదలైన నేపథ్యంలో నేరుగా మోతిహారి వెళ్లి అక్కడ షుగర్ మిల్లులో పనిచేస్తూ ఏరియర్స్‌కోసం ఆందోళన చేసి నిరసనగా ఆత్మహత్యకు పాల్పడిన ఇద్దరు ప్రైవేటు యూనియన్ నాయకుల కుటుంబాలను కలవనున్నారట. తన పార్టీ తరుపున ఆ రెండు కుటుంబాలకు చెరో రూ.50వేలు ఆర్థిక సహాయం చేయనున్నట్లు తెలిపాడు. రెండు కుటుంబాలు ఆగమై పోయినా కనీసం ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పట్టించుకోలేదని మండిపడ్డారు. అందుకే తాను వారి కుటుంబాలకు అండగా నిలవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. పప్పుయాదవ్ అరెస్టు, చేతికి బేడీలు ఉంచే కోర్టుకు తీసుకెళ్లడంపై ఆయన భార్య కాంగ్రెస్ ఎంపీ రంజీత్ రంజన్ లోక్‌సభలో లేవనెత్తారు.