పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి.
న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఇటీవల మృతి చెందిన సభ్యులు, మాజీ సభ్యులకు ఉభయ సభలు సంతాపం తెలిపాయి. తర్వాత రెండు సభలు రేపటికి వాయిదా పడ్డాయి. తెలుగు ప్రముఖులు దాసరి నారాయణరావు, పాల్వాయ్ గోవర్థన్ రెడ్డి, డాక్టర్ సి. నారాయణరెడ్డి మృతికి రాజ్యసభ సంతాపం తెలిపింది. దేశానికి వారు చేసిన సేవలను కొనియాడింది. ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన అమర్‌నాథ్ యాత్రికుల మృతికి పార్లమెంట్ ఉభయ సభలు సంతాపం ప్రకటించాయి.
బీజేపీ నేత వినోద్ ఖన్నా మృతికి లోక్‌సభ సంతాపం తెలిపింది. లోక్‌సభలో ఎంపీగా ఫరూఖ్ అబ్దుల్లా ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల జరిగిన శ్రీనగర్ ఉప ఎన్నికలో ఆయన ఎంపీగా గెలుపొందారు. వర్షాకాల సమావేశాలు విజయవంతంగా జరిగేందుకు సహకరించాలని ప్రధాని నరేంద్ర మోదీ అంతకుముందు విపక్షాలకు విజ్ఞప్తి చేశారు. అన్ని పార్టీల ఎంపీలు చర్చల్లో చురుగ్గా పాల్గొనాలని సూచించారు. జీఎస్టీ స్ఫూర్తితో కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.