
నిత్యావసరాల సరఫరాపై కేంద్రం చర్యలు
సాక్షి, న్యూఢిల్లీ : నిత్యావసర వస్తువులు ప్రజలకు సౌకర్యవంతంగా, సురక్షితంగా అందేలా చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పియూష్ గోయల్ ప్రకటించారు. కోవిడ్ -19 లాక్ డౌన్ నేపథ్యంలో ఈకామర్స్, లాజిస్టిక్ రంగాలవారు ఎదుర్కొంటున్న సమస్యలను సంబంధిత వర్గాలతో చర్చించేందుకు మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నిత్యావసర వస్తువులు ప్రజలకు సౌకర్యవంతంగా, అత్యంత సురక్షితంగా అందేలా చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పరిశ్రమ వర్గాలకు హామీ ఇచ్చారు.
ఈ సమావేశానికి స్నాప్‌డీల్, షాప్‌క్లూస్, ఫ్లిప్‌కార్ట్, గ్రోఫెర్స్ , నెట్ మెడ్స్, ఫార్మ్ ఈజీ, ఐఎంజి టెక్, ఉడాన్, అమెజాన్ ఇండియా, బిగ్ బాస్కెట్, జొమాటో, వంటి ఈ కామర్స్ కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. పెద్ద రీటైల్ ఆపరేటర్ల తరఫున మెట్రో క్యాష్ అండ్ క్యారీ, వాల్‌మార్ట్, ఆర్‌పిజి ప్రతినిధులు హాజరుకాగా లాజిస్టిక్ ఆపరేటర్ల తరఫున ఎక్స్‌ప్రెస్ ఇండస్ట్రీ కౌన్సిల్, డెలిహివెరి, సేఫ్ ఎక్స్‌ప్రెస్, పేటిఎం, స్విగ్గీ ప్రతినిధులు హాజరయ్యారు. ఇక నిత్యావసర వస్తువుల నిరంతర సరఫరాకు సంబంధించి వివిధ అంశాలలో రాష్ట్ర ప్రభుత్వాలకు హోం మంత్రిత్వ శాఖ నిర్ధిష్ట మార్గదర్శకాలు జారీచేసింది.
లాక్‌డౌన్ సమయంలో సరకు రవాణా, తయారీ, సామాన్యుడికి చేరవేత వంటి వాటి్కి సంబంధించి ఆయా సంస్థలు ఎదుర్కొనే ఇబ్బందులను పరిశీలించేందుకు ఈ డిపార్టమెంట్ ఒక కంట్రోల్ రూం ను ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షిస్తోంది. దేశవ్యాప్త లాక్ డౌన్ కారణంగా ఇండియన్ పేటెంట్స్ కార్యాలయం సమాధానాలు దాఖలు చేయడం, ఫీజుల చెల్లింపు వంటి వాటి గడువును పొడిగించింది.