
దంతెవాడ సభలో రైతుకు బోనస్‌ను అందజేస్తున్న ప్రధాని మోదీ
తుపాకులను వీడి జనజీవన స్రవంతిలో కలవాలని, శాంతి కోసం హింసకు చరమగీతం పాడాలని ప్రధానమంర్రి నరేంద్రమోదీ మావోయిస్టులకు హితవు పలికారు.
- నక్సల్స్‌కు మోదీ హితవు
- దంతేవాడలో ప్రధాని పర్యటన.. రూ. 24 వేల కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
దంతెవాడ: తుపాకులను వీడి జనజీవన స్రవంతిలో కలవాలని, శాంతి కోసం హింసకు చరమగీతం పాడాలని ప్రధానమంర్రి నరేంద్రమోదీ మావోయిస్టులకు హితవు పలికారు. మతిలేని చావులకు ఇకనైనా స్వస్తి పలకాలని.. భుజాన తుపాకుల స్థానంలో నాగళ్లు రావాలని పిలుపునిచ్చారు. దేశంలో హింసకు భవిష్యత్తు లేదని ఉద్ఘాటించారు. ఆయన శనివారం మావోయిస్టుల ప్రాబల్య ప్రాంతమైన ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడలో పర్యటించారు.
1985లో నాటి ప్రధాని రాజీవ్‌గాంధీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో దేశ ప్రధాని పర్యటించడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా బస్తర్ ప్రాంతంలో రూ. 24 వేల కోట్ల విలువైన పనులకు మోదీ శంకుస్థాపన చేశారు. ఇందులో అల్ట్రా మెగా స్టీల్ ప్లాంట్, జగదల్‌పూర్-రోఘాట్ రైల్వే లైన్, మురుగునీటి పైప్‌లైన్ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో ప్రసంగించారు.
‘‘దేశంలో హింసకు భవిత లేదు. తుపాకులు కాదు.. భుజాన నాగళ్లు మాత్రమే సమస్యకు పరిష్కారం చూపుతాయి. నక్సలిజం పుట్టిన నక్సల్బరీ వెళ్లి చూడండి. బాంబుల మోత, హింసా రక్తపాతాలు చూసిన ఆ నేలపై ఇప్పుడు హింస లేదు. పంజాబ్‌లో కూడా హింస సమసిపోయింది. అభివృద్ధే అన్ని సమస్యలకు పరిష్కారం చూపుతుంది’’ అని పేర్కొన్నారు. ‘‘నక్సల్స్ హింస వల్ల కన్నవారిని కోల్పోయిన పిల్లల ఇళ్లకు మీరు వెళ్లండి. వారితో ఐదు రోజులు గడపండి. వారి కష్టాలను చూడండి. మీ బుల్లెట్లతో దెబ్బతిన్నవారిని చూస్తే మీరే మారతారు’’ అని సూచించారు.
అంతకు ముందు ప్రధాని జవాంగ గ్రామంలో ఎడ్యుకేషన్ సిటీని సందర్శించారు. అక్కడ అణగారిన వర్గాల పిల్లలు, వికలాంగ విద్యార్థులతో ముచ్చటించారు. మూగ, చెవిటి పిల్లలకు అందిస్తున్న సేవల గురించి తెలుసుకున్నారు. అక్కడ్నుంచి దాదాపు 20 కిలోమీటర్లు రోడ్డుమార్గంలో ప్రయాణించి దంతెవాడ చేరుకున్నారు. ప్రధాని వెంట సీఎం రమణ్‌సింగ్, కేంద్రమంత్రి నరేంద్రసింగ్ తొమార్ తదితరులున్నారు.
250 మందిని కిడ్నాప్ చేసిన నక్సల్స్
నక్సలైట్లు ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో స్థానికంగా ఒక వంతెన నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ పలు గ్రామాలకు చెందిన 250 మందిని శుక్రవారం రాత్రి కిడ్నాప్ చేశారు. శనివారం ఒక వ్యక్తిని హతమార్చి, మిగతా వారిని వదిలేశారని పోలీసులు తెలిపారు.