
భారత్–బెలారస్ బంధం విస్తృతం
► బెలారస్ అధ్యక్షుడితో మోదీ చర్చలు
► 10 ఒప్పందాలపై సంతకాలు
న్యూఢిల్లీ: ద్వైపాక్షిక సహకారాన్ని విస్తృతం చేసుకోవడంతో పాటు ‘మేకిన్ ఇండియా’ కింద ఉమ్మడిగా రక్షణ ఉత్పత్తుల తయారీని ప్రోత్సహించాలని భారత్, బెలారస్‌లు నిర్ణయించాయి. ఈ మేరకు చమురు, వ్యవసాయం, సైన్స్ అండ్ టెక్నాలజీ, విద్య, క్రీడల రంగాల్లో ఇరు దేశాల మధ్య 10 ఒప్పందాలు కుదిరాయి. భారత్ పర్యటనకు వచ్చిన బెలారస్ అధ్యక్షుడు ఏజీ ల్యూకాశెంకో మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరిపారు. రెండు దేశాల ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయాలని, వాణిజ్యం, పెట్టుబడులకు ఇరు దేశాల్లో అవకా శాలు పుష్కలంగా ఉన్నాయని ఇద్దరు నేతలు పేర్కొన్నారు.
భేటీ అనంతరం సంయుక్త మీడియా సమావేశంలో మోదీ మాట్లాడుతూ ల్యూకాశెంకోతో జరిపిన చర్చలు ముందుచూపుతో కూడుకున్నవని, రెండు దేశాల మధ్య సంబంధాలు ప్రారంభమై పాతికేళ్లు పూర్తయ్యాయని అన్నారు. ‘ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై అభిప్రాయాలు పంచుకున్నాం. రెండు దేశాల సంబంధాల నిర్మాణాన్ని సమీక్షించాం. వాటిని మరింత విస్తరించడానికి ఉన్న మార్గాలపై చర్చించాం. ‘మేకిన్ ఇండియా’ కింద రక్షణ రంగంలో ఉమ్మడిగా తయారీని చేపట్టడానికి బెలారస్ ఆసక్తి వ్యక్తం చేసింది’ అని మోదీ వెల్లడించారు. సహకారాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు రెండు దేశాలు ముందడుగు వేశాయని ల్యూకాశెంకో అన్నారు.