సాక్షి, న్యూఢిల్లీ : దేశ ప్రధానిగా మరోసారి ప్రమాణ స్వీకారం చేయనున్న నరేంద్ర మోదీ గురువారం ఉదయం రాజ్‌ఘాట్‌లో మహాత్మ గాంధీకి నివాళులు అర్పించారు. రాజ్‌ఘాట్ నుంచి నేరుగా అటల్ మెమోరియల్‌కు చేరుకున్న మోదీ దివంగత ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయికి నివాళులు అర్పించారు. మహాత్మ గాంధీ, వాజ్‌పేయిలకు నివాళులు అర్పించిన అనంతరం దేశ సేవలో ప్రాణాలు కోల్పోయిన అమర జవాన్ల స్మృతి చిహ్నంగా ఇండియా గేట్ వద్ద నిర్మించిన నేషనల్ వార్ మెమోరియల్‌కు వెళ్లి అమర జవాన్లకు శ్రద్ధాంజలి ఘటించారు.
ప్రధాని వెంట బీజేపీ చీఫ్ అమిత్ షా, పార్టీ నేతలు, కేంద్ర మంత్రులు రవిశంకర్ ప్రసాద్, మేనకా గాంధీ, స్మృతి ఇరానీ, జేపీ నడ్డా తదితరులున్నారు. కాగా గురువారం సాయంత్రం రాష్ట్రపతి భవన్‌లో జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి దేశ, విదేశీ నేతలు సహా దాదాపు 8000 మంది అతిధులు హాజరు కానున్నారు. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు,పార్టీల నేతలు, పరిశ్రమ వర్గాలు, దౌత్యవేత్తలు, రాయబారులు, పలు రంగాలకు చెందిన ప్రముఖులు అతిధుల జాబితాలో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment