ప్రధాని డిగ్రీ వివరాలు ఇవ్వండి: సీఐసీ
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ డిగ్రీలకు సంబంధించి వివరాల్ని అందించాలంటూ ఢిల్లీ, గుజరాత్ వర్సిటీలతో పాటు ప్రధాని కార్యాలయాన్ని కేంద్ర సమాచార సంఘం(సీఐసీ) శుక్రవారం ఆదేశించింది. డిగ్రీ పూర్తయిన ఏడాది, ఇతర వివరాలు అందిస్తే పూర్తి సమాచారం ఇచ్చేందుకు ఆయా వర్సిటీలకు వీలువుతుందని సీఐసీ కమిషనర్ శ్రీధర్ ఆచార్యులు పీఎంఓను కోరారు.
1978 లో గ్రాడ్యుయేషన్ (ఢిల్లీవర్సిటీ) 1983లో పోస్టు గ్రాడ్యుయేషన్ (గుజరాత్ యూనివర్సిటీ)లకు సంబంధించి నరేంద్ర దామోదర్ మోదీ పేరిట ఉన్న వివరాల్ని పరిశోధించి ఇవ్వాలంటూ ఆయా యూనివర్సిటీల ప్రజా సమాచార విభాగం అధికారులను సమాచార సంఘం కోరింది. ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి ప్రధాని విద్యార్హతల వివరాల్ని కోరినప్పుడు ఇవ్వడం సబబుగా ఉంటుందని తన ఉత్తర్వుల్లో ఆచార్యులు పేర్కొన్నారు. ప్రధాని డిగ్రీలపై కేజ్రీవాల్ నుంచి వచ్చిన వివరణల్నే ఆర్టీఐ దరఖాస్తుగా పరిగిణించిన సీఐసీ ఈ ఆదేశాలు జారీచేసింది.