
'ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పని చేయాలి'
మైసూరు : ప్రజా సంక్షేమం, ఆర్థిక అభివృద్ధే లక్ష్యంగా పని చేయాలని శాస్త్రవేత్తలకు దేశ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. 103వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ను మోదీ ఆదివారం బెంగళూరులో ప్రారంభించారు. అనంతరం దేశవిదేశాలకు చెందిన శాస్త్రవేత్తలను ఉద్దేశించి నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ.... శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం వినియోగంతోనే సుపరిపాలన సాధ్యమని ఆయన స్పష్టం చేశారు.
అలాగే 2030 నాటికి దేశంలో పేదరిక నిర్మూలన, అభివృద్ధిలో భారత్ను ఆగ్రస్థానంలో నిలపడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. శాస్త్ర, పరిశోధన రంగాన్ని ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకు వస్తామన్నారు. మైసూరు విశ్వవిద్యాలయానికి శతాబ్ది ఉత్సవాలు జరగనున్నాయని ఈ సందర్భంగా మోదీ గుర్తు చేశారు.
అలాంటి తరుణంలో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సదస్సుకు ఈ విశ్వవిద్యాలయం వేదిక కావడం ఆనందంగా ఉందన్నారు. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్, మైసూరు విశ్వవిద్యాలయం రెండూ ఒకేసారి తమ ప్రయాణాన్ని ప్రారంభించాయని మోదీ పేర్కొన్నారు. కొత్త సంవత్సరంలో దేశ విదేశాలకు చెందిన శాస్త్రవేత్తలతో కలసి ఈ సదస్సు పాల్గొనడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
ఇండియన్ సైన్స్ కాంగ్రెస్లో భాగస్వాములు కావాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు మోదీ విజ్ఞప్తి చేశారు. గొప్ప నేతలంతా మైసూరు విశ్వవిద్యాలయంలోనే చదువుకున్నారని చెప్పారు. ఈ సదస్సుకు 10 వేల మంది దేశ విదేశీ ప్రతినిధులు హాజరయ్యారు. 30 మంది శాస్త్రవేత్తలకు మోదీ పురస్కారాలను ప్రదానం చేశారు.