చెన్నై నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: దేశ రాజధాని ఢిల్లీలో టపాకాయల విక్రయాలపై సుప్రీంకోర్టు నిషేధం విధించిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా కాలుష్యం కలిగించని బాణసంచా తయారీకి ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నట్లు కేంద్ర శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ తెలిపారు. ఓ వైద్యుడిగా సుప్రీంకోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని, అయితే టపాసులు పేల్చడం వల్ల కలిగే అనుభూతిని ఎవరూ కోల్పోరాదన్నది తన అభిప్రాయమని చెప్పారు. ఆయన శనివారం చెన్నైలోని సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో విలేకరులతో మాట్లాడుతూ, ఇటీవల బాణసంచా తయారీదారులు తనను కలిసినప్పుడు ఇదే విషయాన్ని వారికి తెలిపామని, శాస్త్రవేత్తల సహకారంతో పర్యావరణ కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించగల టపాసుల తయారీ కష్టమేమీ కాకపోవచ్చని పేర్కొన్నారు.
దేశంలో అపరిష్కృతంగా ఉన్న పౌర సమస్యలకు పరిష్కారాలు కనుక్కునే దిశగా పరిశోధనలను మళ్లించిన ఘనత తమదేనన్నారు. దేశంలోని వేర్వేరు పరిశోధన శాలల్లో జరుగుతున్న పరిశోధనలను అంతరిక్షం, వ్యవసాయం, వైద్యం, నానో టెక్నాలజీ వంటి భాగాలుగా వర్గీకరించి.. ఆయా రంగాల్లో సమన్వయం కోసం కృషి చేస్తున్నట్లు తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు వార్తలు, పోస్టులు ఎక్కువ అవుతుండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఫేస్‌బుక్, ట్వీటర్ వంటి సామాజిక మాధ్యమాలు రెండు వైపులా పదునున్న కత్తి వంటివని.. కొంతమంది వీటిని తప్పుడు వార్తల ప్రసారానికి వాడుకోవడం సరికాదని హితవుపలికారు.
ఈశాన్య రాష్ట్రాలకు పెద్దపీట
శాస్త్ర, సాంకేతిక రంగాల్లో దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురవుతున్న ఈశాన్య రాష్ట్రాలకు తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని హర్షవర్ధన్ స్పష్టం చేశారు. ఇటీవలి కాలంలో ఈశాన్య రాష్ట్రాల్లో అత్యధిక సంఖ్యలో కొత్త పరిశోధన సంస్థలు ఏర్పాటు చేయడం.. శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాలకు కేటాయించే బడ్జెట్‌లో కనీసం పది శాతం ఇక్కడి బయోటెక్నాలజీ రంగానికి ఇస్తుండటం తమ నిబద్ధతకు నిదర్శనమని తెలిపారు. ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ రెండేళ్లు ఢిల్లీలో నిర్వహించగా.. తాజాగా ఇప్పుడు చెన్నైలో జరుగుతోందని.. వచ్చే ఏడాది ఈశాన్య రాష్ట్రాల్లో నిర్వహించాలన్నది తన అభిప్రాయమని చెప్పారు.
ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ వందేళ్లుగా జాతీయ స్థాయిలో కార్యక్రమాలను నిర్వహిస్తున్నప్పటికీ.. కేవలం శాస్త్రవేత్తలు పరిశోధన వ్యాసాలు ప్రచురించేందుకు, వారిలో వారు చర్చలు జరిపేందుకు మాత్రమే ఉపయోగపడుతోందని పేర్కొన్నారు. ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్‌లో శాస్త్రవేత్తలతోపాటు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, పరిశ్రమ వర్గాలను ఒకేచోటికి చేర్చడం ద్వారా ప్రజల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నామని వివరించారు.
కాలుష్య రహిత టపాసులు!
Published Sun, Oct 15 2017 1:39 AM | Last Updated on Thu, Sep 13 2018 5:25 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment