'పవర్ ఆఫ్ పాటీదార్' కు సెన్సార్ చిక్కులు!
సూరత్ః పవర్ ఆఫ్ పాటీదార్ పై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిమ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్సీ) అభ్యంతరాలు వ్యక్తం చేసింది. గతంలో గుజరాత్ రాష్ట్రంలో చెలరేగిన పాటీదార్ ఆందోళన ఆధారంగా తెరకెక్కనున్న గుజరాతీ సినిమా విడుదలకు అనుమతి నిరాకరించింది. రాళ్ళు రువ్వుకోవడం, గుజరాత్ ముఖ్యమంత్రి ఆనందీబెన్ పటేల్, ప్రధాని నరేంద్ర మోదీ వంటి వారి నిజమైన పేర్లను వాడటం వంటి అనేక కారణాలతో సినిమా విడుదలకు తిరస్కరించింది.
పాటీదార్ అనామత్ ఆందోళన్ సమితి ఆధ్వర్యంలో గతంలో గుజరాత్ లో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగిన విషయం తెలిసిందే. అయితే ఆందోళనల నేపథ్యంలో తీసిన గుజరాతీ సినిమా 'పవర్ ఆఫ్ పాటేదార్' విడుదలకు సీబీఎఫ్సీ అనుమతి నిరాకరించింది. గుజరాత్ లో జరిగిన ఆందోళనల్లో రాళ్ళు రువ్వుకోవడం వంటి సన్నివేశాలతోపాటు, ముఖ్యమంత్రి ఆనందీబెన్ పటేల్, ప్రధాని నరేంద్ర మోదీ మొదలైనవారి పేర్లను సినిమాలో వాడటమే కాక, ఆందోళన సమయంలో హార్థిక్ కు సహాయకులుగా ఉన్నవారే సినిమాలో పాత్రలు ధరించడంపై కూడా సెన్సార్ బోర్డు అభ్యంతరాలు వ్యక్తం చేసింది. అయితే సెన్సార్ బోర్డు ఇప్పటిదాకా సినిమాలో అభ్యంతరకర సీన్లు కట్ చేయడంపై తమకు ఎటువంటి రాత పూర్వక ఆదేశాలు జారీ చేయలేదని, అటువంటి ఆదేశాలు అందితే సెన్సార్ బోర్డ్ నిర్ణయంపై హైకోర్టును ఆశ్రయించనున్నట్లు సినిమా నిర్మాత మహేష్ పటేల్ తెలిపారు. సినిమాలో హార్థిక్ పటేల్ తో సహా ఆందోళనలోపాల్గొన్న అనేకమంది నాయకులకు చెందిన పేర్లను వాడటంతోనే సీబీఎఫ్సీ అడ్డు చెప్తున్నట్లు పటేల్ తెలిపారు. అంతేకాక పాటీదార్ టైటిల్ పై కూడా సీబీఎఫ్సీ అభ్యంతరం తెలుపుతున్నట్లు పేర్కొన్నారు.
గుజరాత్ ఆందోళన, హార్థిక్ పటేల్ కు సంబంధించిన కథలు తెరకెక్కితే.. అది వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపిస్తాయన్నదే ప్రధాన కారణం అయి ఉండొచ్చని, అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యే వరకూ అటువంటి సినిమాలు రాకుండా చేసేందుకు ఇది.. ప్రభుత్వం చేస్తున్నప్రయత్నంలో భాగంలానే ఉందని పటేల్ అన్నారు. అలాగే ముఖ్యమంత్రి ఆనందీ బెన్ క్యారెక్టర్ ను సినిమాలో పెట్టడం కూడా అభ్యంతరానికి మరోకారణంగా తెలుస్తోందన్నారు. ఒకవేళ బోర్డు.. సినిమాలోని అభ్యంతరకర సన్నివేశాలు కట్ చేసేందుకు ఆదేశిస్తే అందుకు తాము సిద్ధమేనని, కానీ సినిమా మొత్తానికే సమస్యాత్మకం చేస్తున్నారని, ఇప్పటికే కేసర్ భవానీ ఫిల్మ్ ప్రొడక్షన్ సమర్పణలో 12 కు పైగా గుజరాతీ సహా ఇతర భాషా చిత్రాలను నిర్మించిన 'పవర్ ఆఫ్ పాటీదార్' నిర్మాత పటేల్ ఆందోళన వ్యక్తం చేశారు.