న్యూఢిల్లీ: మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా ప్రకాశ్ జవదేకర్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. కార్యాలయ సిబ్బంది ఆయనకు పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సవాళ్లను అధిగమించి వాటిని అవకాశాలుగా మార్చుకుంటామన్నారు. అన్ని రాష్ట్రాలకు తమ మద్దతు ఉంటుందని జవదేకర్ తెలిపారు. ఎలాంటి వివాదాలకు తావు లేకుండా దేశంలో విద్యాప్రమాణాలను పెంచడానికి తన వంతు కృషి చేస్తానని జవదేకర్ అన్నారు.
విద్యారంగంలో సంస్కరణల అమలుకు కృషి చేయడంతోపాటు.. పేదలకు సైతం ఉన్నత విద్యను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు. అలాగే హెచ్ఆర్డీ అధికారులతో సమావేశమైన అనంతరం విద్యకు సంబంధించి రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తామన్నారు. ఇక స్మృతి ఇరానీ శాఖ మార్పుపై జేడీయూ ఎంపీ అలీ అన్వర్ వ్యాఖ్యలను జవదేకర్ ఖండించారు.
కాగా కేంద్ర మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా కేంద్ర సహాయ మంత్రి (పర్యావరణం-స్వతంత్ర హోదా) ప్రకాష్ జవదేకర్కు కేబినెట్ హోదా లభించిన విషయం తెలిసిందే. అలాగే స్మృతి ఇరానీని మానవనరుల అభివృద్ధి శాఖ నుంచి తప్పించి.. జౌళిశాఖ అప్పగించారు. ఈ నేపథ్యంలో జవదేకర్... నిన్న స్మృతి ఇరానీని కలిశారు.