'అవును! నేను చెంచానే.. '
ముంబయి: తాను ఎవరికీ క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదని, రాజీనామా అంతకంటే అవసరం లేదని కేంద్ర సెన్సార్ బోర్డు చీఫ్ పహ్లాజ్ నిహలాని అన్నారు. ఉడ్తా పంజాబ్ చిత్రంలో మొత్తం 89 కట్ లు విధించడంపై పెద్ద దుమారం రేగుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్ర నిర్మాత అనురాగ్ కశ్యప్ ఇప్పటికే కట్ లు కుదరదని, భావ ప్రకటన స్వేచ్ఛకు విరుద్ధం అని పోరాడుతుండగా ఆయనకు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా తోడయింది. ఈ చిత్రానికి కట్ లు విధించడం వెనుక రాజకీయ కుట్ర ఉందని ఆరోపించింది.
అయితే, తన నిర్ణయం వెనుక రాజకీయ ఒత్తిడులు లేవని ఇప్పటికే స్పష్టం చేసిన ఆయన చిత్రం విషయంలో సూటిగా సమాధానాలు ఇచ్చారు. కట్ లు చేస్తేనే చిత్ర విడుదలకు అనుమతి ఉంటుందని అన్నారు. అలాగే, మోదీ చెంచాగా నిహలాని వ్యవహరిస్తున్నారని అనురాగ్ కశ్యప్ చేసిన వ్యాఖ్యలపై ధీటుగా స్పందించారు. 'అవును.. నేను మోదీ చెంచానే(శిష్యుడు).. మోదీ చెంచాగా చెప్పుకునేందుకు గర్వపడతాను. అలా కాకుండా ఓ ఇటాలియన్ ప్రధానికి చెంచాగా ఉండమంటారా? అని ఆయన ఎదురు ప్రశ్నించారు. సినిమా చూస్తేగానీ ఆ చిత్ర టైటిల్లో పంజాబ్ అనే పేరు ఎందుకు తొలగించామో మీకు అర్థం కాదని అన్నారు.