కోలకతా: ఉత్తర, ఈశాన్యభారతాన్ని వణికించిన భూకంపం పశ్చిమబెంగాల్ లోని పలు నగరాల్లో ప్రభావాన్ని చూపించింది. భూ ప్రకంపనలతో జనం భయభ్రాంతులయ్యారు. బెంగాల్ లో శనివారం సంభవించిన తీవ్రత రిక్టర్ స్కేల్పై 7.9 గా నమోదైనట్టు అధికారులు ప్రకటించారు. డార్జిలింగ్ జిల్లాలోని సిలిగురి ఏరియాలో ఇద్దరు మరణించారు. దాదాపు ఇరవైమందికి తీవ్రగాయలయ్యాయి. గోడ కూలిన ఘటనలో ఒక వ్యక్తి మరణించగా, భవనం కుప్పకూలిన ఘటనలో మరో మహిళ మరణించింది. భవన శిథిలాల కింద ఆమె మృతదేహాన్ని కనుగొన్నామని డిప్యూటీ కమిషనర్ పాల్ తెలిపారు.
క్షతగాత్రులను సమీపంలోని ఆసుప్రతులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కోలకతా నగరంలోని పలు భవనాలు బీటలు వారాయి. ప్రజలు ఇళ్లల్లోంచి బయటుకు పరుగులు తీశారు. ముఖ్యమంత్రి మమతాబెనర్జీ రాష్ట్రంలో నెలకొన్న భూకంపం పరిస్థితిపై స్పందించారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రశాంతంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. పరిస్థితిని జాగ్రత్తగా గమనిస్తున్నామని ఆమె తెలిపారు. ముఖ్యంగా డార్జిలింగ్, సిలిగురి తదితర ఏరియాల్లోని సీనియర్ అధికారులతో చర్చించినట్లు ఆమె తెలిపారు.