సాక్షి, న్యూఢిల్లీ : గుజరాత్ ఎన్నికల తరువాత కాంగ్రెస్ పార్టీలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. గుజరాత్‌లో మంచి ఫలితాలిచ్చిన హిందూ సానుకూల వ్యూహాన్నే రాజస్తాన్, మధ్యప్రదేశ్, కర్ణాటక శాసనసభ ఎన్నికల్లోనూ అనుసరించాలని రాహుల్ గాంధీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. గుజరాత్ ఎన్నికల్లో మొత్తం 14 ఆలయాలను రాహుల్ గాధీ సందర్శించారు. త్వరలో ఎన్నికలు జరగనున్న రాజస్తాన్, మధ్యప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో హిందూ భావజాలం అధికంగా ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు హిందూ మనోభావాలను గుర్తించేలా వ్యవహరించాలని రాహుల్ భావిస్తున్నట్లు తెలిసింది.
ఇదిలావుండగా.. ఆయా రాష్ట్రాల్లో రాహుల్ పర్యటించే సమయంలో.. పలు ఆలయాలు, మసీదులను కూడా సందర్శిస్తారని కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నారు. రాజకీయాలకు మతం రంగు పులమడం దేశానికి మంచిది కాదని సీనియర్ కాంగ్రెస్ నేత రాజ బబ్బర్ వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ శివభక్తుడు కావడమే కాంగ్రెస్‌కు మేలు చేస్తుందని అన్నారు. బీజేపీ హిందూ పాచికలు ఇకపై పనిచేయవని రాజ్ బబ్బర్ చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ 2014 లోక్‌సభ, 2017 యూపీ ఎన్నికల్లో మైనారిటీ అనకూలవాదంతో ప్రజల్లోకి వెళ్లింది. అదే సమయంలో బీజేపీ హిందూ అనుకూల ముద్రతో ముందుకు వెళ్లింది. ఈ సమయంలో మెజారిటీ ఓటర్లు.. బీజేపీకి అనుకూలంగా తీర్పు నిచ్చారని.. కాంగ్రెస్ పార్టీ అంతర్గత చర్చల్లో నేతలు తేల్చారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ గుజరాత్‌లో హిందూ సానుకూల వాదంతో ముందకు వెళ్లడం తెలిసిందే. ఇక్కడ కాంగ్రెస్ సపార్టీ తృటిలో అధికారానికి దూరమైంది. కాంగ్రెస్ పార్టీ గుజరాత్‌లో హిందూ అనకూల వ్యూహాన్ని అనుసరించడంపై ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ సహా పలువురు ముస్లిం నాయకులు విమర్శలు గుప్పించారు. అయినా ఎక్కడా హిందూ సంస్థల మీద రాహుల్ గాంధీ, స్థానిక కాంగ్రెస్ నేతలు విమర్శలు చేయలేదు.
ఆలయాల జాబితా
ఎన్నికలు జరగనున్న రాజస్తాన్‌లో ప్రఖ్యాత పుష్కర్‌లోని బ్రమ్మ, జోధ్‌పూర్‌లోని చాముండేశ్వరి మాత ఆలయాలను రాహుల్ సందర్శించనున్నారు. అలాగే కర్ణాటకలో రాహుల్ గాంధీ సందర్శించాల్సిన ఆలయాల జాబితాను స్థానిక నేతలు సిద్ధం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment