రాహుల్‌గాంధీకి మరో షాక్!
న్యూఢిల్లీ: మహారాష్ట్రలోని రత్నగిరిలో రూ. 3,650 కోట్లతో ఏర్పాటుచేయనున్న పేపర్ మిల్‌పై కేంద్ర క్యాబినెట్ త్వరలోనే నిర్ణయం తీసుకోనుంది. మొదట కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ నియోజకవర్గమైన అమేథిలో ఈ ప్రాజెక్టును ఏర్పాటుచేయాలని భావించారు. కానీ శివసేన డిమాండ్ చేయడంతో ఈ ప్రాజెక్టును మహారాష్ట్రకు తరలించారు. ఈ ప్రాజెక్టు విషయమై కేంద్ర ఆర్థికశాఖతోపాటు వివిధ మంత్రిత్వశాఖలకు లేఖలు రాశామని, వారి అభిప్రాయాలు సేకరించిన తర్వాత కేంద్ర క్యాబినెట్ ముందు ప్రతిపాదనలు పెడతామని భారీ పరిశ్రమల శాఖమంత్రి, శివసేన ఎంపీ అనంత్ గీతె తెలిపారు.
ఈ పేపర్ మిల్లు ఏర్పాటుద్వారా స్థానికంగా 900 మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయి. దీని ఏర్పాటును ముమ్మరం చేయాలని పార్లమెంటరీ స్థాయీ సంఘం ఇటీవల ప్రభుత్వాన్ని కోరింది. ఉత్తరప్రదేశ్‌లోని అమేథి నియోజకవర్గం నుంచి తరలించిన మరో ప్రాజెక్టు ఇది కావడం గమనార్హం. గతంలో యూపీఏ ప్రభుత్వం అమేథిలోని జగదీశ్‌పూర్‌లో ప్రతిపాదించిన శక్తిమాన్ మెగాఫుడ్ పార్క్ ఏర్పాటును ఇప్పటికే ఎన్డీయే ప్రభుత్వం రద్దుచేసింది. యూపీఏ హయాంలో పెట్రోలియం శాఖ ఈ ప్రాజెక్టుకు సబ్సిడీపై గ్యాస్ ఇవ్వడానికి నిరాకరించడంతో ఈ ప్రాజెక్టును రద్దు చేశాని ప్రభుత్వం చెబుతోంది. ఈ అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తిన రాహుల్‌గాంధీ మోదీ ప్రభుత్వం రాజకీయ కక్షసాధింపులకు పాల్పడుతున్నదని విమర్శించారు. వెనుకబడిన నియోజకవర్గమైన అమేథికి గత యూపీఏ ప్రభుత్వం ఎన్నో ప్రాజెక్టులు ప్రకటించినా ఏవీ ఆచరణరూపం దాల్చలేదు.