న్యూఢిల్లీ : దేశంలోనే తొలి సెమీ హైస్పీడ్ రైలుగా గుర్తింపు పొందిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ బుధవారం నాటికి లక్ష కిలోమీటర్ల ప్రయాణం పూర్తి చేసిందని రైల్వే శాఖ తెలిపింది. ఈ క్రమంలో ఒక్క ట్రిప్ కూడా మిస్సవకుండా ప్రయాణికులను గమ్యస్థానానికి చేర్చిందని గురువారం వెల్లడించింది. ఈ విషయం గురించి రైల్వే సీనియర్ అధికారి మాట్లాడుతూ..‘ ప్రధాని నరేంద్ర మోదీ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ లక్ష కిలోమీటర్లు ప్రయాణించింది. న్యూఢిల్లీ నుంచి వారణాసిల మధ్య ప్రయాణించే ఈ రైలు గత మూడు నెలల్లో ఒక్కరోజు కూడా తన ప్రయాణం ఆపలేదు’ అని పేర్కొన్నారు.
కాగా ఈ ఏడాది ఫిబ్రవరి 15న ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 17 నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చిన ఈ రైలు ఢిల్లీ నుంచి వారణాసికి 8 గంటల్లో చేరుకుంటుంది. సాధారణ రైళ్లలో మాత్రం 11.5 గంటల సమయం పడుతుంది. గంటకు గరిష్టంగా 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే వందే భారత్.. వారంలో ఐదు రోజుల పాటు తన సేవలు అందిస్తుంది. ఇందులో 16 ఏసీ కోచ్‌లు ఉండగా.. మొత్తం 1,128 మంది ప్రయాణించేలా ఏర్పాట్లు చేశారు. ఆటోమేటిక్ తలుపులు, వైఫై సదుపాయం, జీపీఎస్ వ్యవస్థతో అనుసంధానం ఇలా అనేక అధునాతనమైన సకల సదుపాయాలు ఈ రైలులో ఉన్నాయి. వందే భారత్‌లో వారణాసి నుంచి ఢిల్లీకి ఎగ్జిక్యూటివ్ క్లాస్‌లో ప్రయాణించేందుకు రూ.3,310, చైర్‌కార్‌లో రూ.1,760 టికెట్ ధర నిర్ణయించారు. ఇక వందే భారత్ ప్రారంభమైన మొదటి రోజునే తిరుగు ప్రయాణంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఓ జంక్షన్ వద్ద నిలిచిపోయింది. దీంతో మోదీ మేకిన్ ఇండియా నినాదం విఫలమైందంటూ ప్రతిపక్షాలు విమర్శించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment