అయోధ్యలో రామాలయ నిర్మాణాన్ని పర్యవేక్షించేందుకు సంక్రాంతి తర్వాతే రామాలయ ట్రస్ట్‌ను ఏర్పాటు చేస్తామని రామ జన్మభూమి న్యాస్ అధ్యక్షుడు మహంత్ నృత్య గోపాల్‌దాస్ స్పష్టం చేశారు. వీలైనంత త్వరగా అయోధ్యలో రామ మందిరాన్ని చూసి తరించాలని తాము కూడా ఉవ్విళ్లూరుతున్నామన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. జనవరి 16 తర్వాత ఏ రోజైనా ట్రస్ట్‌ను ఏర్పాటు చేసే అవకాశముందని పేర్కొన్నారు. ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలోనే రామాలయ నిర్మాణ పనులు జరుగుతాయని వెల్లడించారు. ట్రస్ట్ పర్యవేక్షణ లేకుండా ఇంచు పని కూడా జరగదని వ్యాఖ్యానించారు. కాగా అయోధ్యలో రామనవమి నాడే రాముని ఆలయాన్ని నిర్మించాలనుకున్నారు. కానీ అయోధ్యలోని 2.77 ఎకరాల భూమిపై హిందూ, ముస్లిం పక్షాల మధ్య దశాబ్దాలుగా వివాదం నెలకొంది.
దీనిపై సుప్రీంకోర్టులో వాదనలు జరుగుతున్నందున ఆలయ నిర్మాణపనులను వాయిదా వేశారు. అనంతరం నవంబర్ 9న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం అయోధ్యపై సంచలన తీర్పును ప్రకటించింది. వివాదాస్పద 2.77 ఎకరాల స్థలంలో రామాలయ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రామ మందిర నిర్మాణం కోసం ట్రస్ట్‌ను ఏర్పాటు చేయాలని ధర్మాసనం వివరించింది. అటు ముస్లింలకు మసీదును నిర్మించునేందుకు వీలుగా సున్నీ వక్ఫ్ బోర్డుకు అయోధ్యలోని ప్రముఖ ప్రాంతంలో 5 ఎకరాలను ఇవ్వాలంటూ తీర్పు వెల్లడించింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీం కోర్టులో పలు రివ్యూ పిటిషన్ దాఖలు కాగా న్యాయస్థానం వాటిని తిరస్కరించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment