
రేణుక, పొంగులేటి.. ఢిల్లీ మే సవాల్
ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ నాయకుల మధ్య గ్రూపు రాజకీయాలు తారస్థాయికి చేరుకున్నాయి.
న్యూఢిల్లీ: ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ నాయకుల మధ్య గ్రూపు రాజకీయాలు తారస్థాయికి చేరుకున్నాయి. కాంగ్రెస్ నాయకుల వర్గ పోరు ఏకంగా ఢిల్లీకి చేరుకుంది. కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి శుక్రవారం కాంగ్రెస్ పెద్దలను కలసి పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు.
రేణుకా చౌదరి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని కలవగా, సుధాకర్ రెడ్డి రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. రేణుక, పొంగులేటి ఒకరి గురించి మరొకరు కాంగ్రెస్ పెద్దలకు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. దీంతో ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ నాయకుల మధ్య విభేదాలు మరింత పెరిగాయి. కాంగ్రెస్ పెద్దలు జోక్యం చేసుకుంటే తప్ప ఖమ్మం జిల్లా కాంగ్రెస్ గ్రూపు రాజకీయాలు సమసిపోయేలా కనిపించడం లేదు.