
సునంద ఎలా మరణించారో తెలియలేదు: పోలీసులు
కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ భార్య సునందాపుష్కర్ ఎందుకు మరణించారనే విషయం ఫోరెన్సిక్ నివేదికలో ఏమీ తేలలేదని ఢిల్లీ పోలీసులు తెలిపారు. అసలు ఆ నివేదికలో ఏమీ తేలనేలేదని ఢిల్లీ పోలీసు కమిషనర్ బీఎస్ బస్సీ తెలిపారు. గురువారం లీకైన పోస్టుమార్టం నివేదికలో మాత్రం... ఆమె మరణానికి విషప్రభావమే కారణమని ఉంది. తమకు పూర్తి ఆధారాలు దొరికిన తర్వాత మాత్రమే ఏదైనా విషయాన్ని నిర్ధారించగలమని కమిషనర్ అన్నారు.
ఆధారాలు సేకరించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నామన్నారు. సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (సీఎఫ్ఎస్ఎల్) ఢిల్లీ పోలీసులకు తన నివేదిక ఇచ్చిన పది రోజుల తర్వాత అది లీకవడంతో ఇప్పుడు పోలీసులు దాని గురించి స్పందించారు. సునందాపుష్కర్ జనవరి 17వ తేదీన ఢిల్లీలోని ఓ ఫైవ్స్టార్ హోటల్లో అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించిన విషయం తెలిసిందే.