
ఒక్కసారైనా లాటరీ గెలవాలని ఎంతో మంది కలలు కంటుంటారు. ఎక్కడైనా లాటరీ వేస్తున్నారనగానే అక్కడికి వెళ్లి వెంటనే ఓ కూపన్ తీసేసుకుంటారు. కొందరికి ఇదో సరదా.. కొందరికి ఇదో పిచ్చి.. మరికొందరికి ఇదో వ్యసనం.. ఏదైతేనేమి ఒక్కసారి లాటరీ తగిలితే దశ దిశ మారినట్లే. మరి అలాంటిది మూడు సార్లు లాటరీ తగిలితే.. దాన్నేమనాలి.. ఎక్కడో సుడి ఉందనుకోవాలి.. ఆయనే కేరళకు చెందిన ఆర్పీ మనోహరన్.. ఈయన కేరళ విద్యుత్ శాఖలో పనిచేసి రిటైరయ్యారు. ఇప్పటివరకు వరుసగా మూడేళ్లుగా మూడు లాటరీలు గెలుచుకున్నాడు.
తొలిసారిగా కేరళ ప్రభుత్వం నిర్వహించిన లాటరీని 2016 ఆగస్టులో గెలుచుకున్నాడు. అప్పుడు మనోహరన్ రూ.70 లక్షలు గెలుచుకున్నాడు. ఆ తర్వాత 2017 నవంబర్‌లో నిర్మల్ లాటరీని గెలుచుకున్నాడు. అప్పుడు కూడా రూ.65 లక్షల నగదును సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత ఇప్పుడు తాజాగా మరోసారి లాటరీలో గెలిచి ముచ్చటగా మూడోసారి రూ.70 లక్షలు గెలుచుకున్నాడు. ఇంతకుముందు కూడా చాలా చిన్న చిన్న మొత్తాల్లో లాటరీ గెలుచుకునేవాడినని, కానీ మూడేళ్లుగా ఇంత పెద్ద మొత్తంలో లాటరీ గెలుచుకోవడం చాలా సంతోషంగా ఉందంటున్నాడు. అసలు ఇదంతా నిజమో కలనో కూడా అర్థం కావట్లేదని చెబుతున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment