
రెండో రోజూ రభస
రాజ్యసభను కుదిపేసిన ‘ఉత్తరాఖండ్’ కార్యకలాపాలను అడ్డుకున్న విపక్షాలు
న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలనపై కాంగ్రెస్ నాయకత్వంలో విపక్షాలన్నీ రాజ్యసభలో మంగళవారం రెండో రోజూ నిరసన తెలియజేశాయి. వెల్‌లోకి వచ్చి నినాదాలు చేస్తూ కార్యకలాపాలను అడ్డుకున్నాయి. సభ ప్రారంభం కాగానే ఐదుగురు కొత్త సభ్యులు సుఖ్‌దేవ్ సింగ్ ధిండ్సా, స్వపన్ దాస్‌గుప్తా, సుబ్రమణ్యస్వామి, మేరీకోమ్, నరేంద్ర జాదవ్ ప్రమాణస్వీకారం చేశారు. ప్రధాన మంత్రి మోదీతోపాటు పలువురు కొత్త సభ్యులను అభినందించారు. అనంతరం సభాకార్యక్రమాలు మొదలవగానే కాంగ్రెస్ సభ్యులు వెల్‌లోకి దూసుకొచ్చి నినాదాలు ప్రారంభించారు. ఉత్తరాఖండ్‌లో రావత్ ప్రభుత్వ బర్తరఫ్‌పై చర్చకు పట్టుబట్టారు. దీనికి ప్రభుత్వం నిరాకరించింది. దీంతో పలుమార్లు సభ వాయిదా పడింది. తిరిగి సమావేశమైనా చర్చకు సర్కారు నిరాకరించటంతో సభను బుధవారానికి వాయిదా వేశారు.
చర్చే లేదు: విపక్షాల ఆందోళనపై జోక్యం చేసుకున్న రాజ్యసభ నాయకుడు అరుణ్ జైట్లీ ఈ అంశంపై చర్చకు అవకాశమే లేదని స్పష్టం చేశారు. రాష్ట్రపతి పాలన ప్రకటనను సభ ముందు ప్రవేశపెట్టాకే చర్చ జరుగుతుందన్నారు. ఉత్తరాఖండ్‌లో ద్రవ్యవినిమయ బిల్లును 35 మంది వ్యతిరేకించినా స్పీకర్ బిల్లు నెగ్గిందని చెప్పినపుడే రాజ్యాంగం అపహాస్యం పాలైందన్నారు. స్వతంత్ర భారత చరిత్రలోనే స్పీకర్ ఇలా వ్యవహరించటం జరగలేదన్నారు. దీంతో విపక్ష సభ్యులు ‘మోదీ మీ నియంతృత్వాన్ని సహించం’ అంటూ నినాదాలు చేశారు. రాష్ట్రపతి పాలనను సమర్థిస్తూ.. స్పీకర్ వ్యవస్థపై జైట్లీ చేసిన వ్యాఖ్యలను రికార్డులనుంచి తొలగించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. సభ చర్చకు అనుకూలంగానే ఉందని, విపక్షాలు సభ సజావుగా జరిగేందుకు సహకరించాలంటూ డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ పలుమార్లు అభ్యర్థన చేశారు. కాంగ్రెస్, ఎస్పీ నేతలు చర్చకు నోటీసులివ్వగా.. బీఎస్పీ దీన్ని బలపరిచింది.
ఆందోళన మధ్యే రెండు బిల్లులు
సభలో విపక్షాల నిరసనల మధ్యే ప్రభుత్వం రెండు బిల్లులు(ద్రవ్య వినిమయ చట్టం-2015 సవరణ, రద్దు బిల్లు-2015) ప్రవేశపెట్టింది. దీంతో పాటు రాజ్యాంగ(ఎస్సీ) సవరణ బిల్లు-2016ను డిప్యూటీ చైర్మన్ చర్చకు అనుమతించాలని నక్వీ కోరారు. దీనిపై విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి.
విద్యార్థులపై జరిమానా క్రూరం
జేఎన్‌యూ విద్యార్థిసంఘం నేత కన్హయ్యతోపాటు పలువురు విద్యార్థులపై జరిమానా విధించటం, కాలేజీనుంచి వెళ్లగొట్టడాన్ని రాజ్యసభలో విపక్షాలు లేవనెత్తాయి. ఇది క్రూరమైన చర్య అని వామపక్షాలు ప్రభుత్వంపై ధ్వజమెత్తాయి. చర్చ జరపాలంటూ సీపీఎం నేత తపన్ సేన్ డిమాండ్ చేశారు.
విపక్ష నేతలతో మోదీ కరచాలనం
సభ ప్రారంభానికంటే ముందుగానే సభకు వచ్చిన ప్రధాని మోదీ విపక్ష నేతలతో కరచాలనం చేశారు. ఆంటోనీ, ఆనంద్ శర్మ(కాంగ్రెస్)లతోపాటు బీఎస్పీ చీఫ్ మాయావతినీ పలకరించారు. సీతారాం ఏచూరి(సీపీఎం) భుజంపై చేయివేసి కాసేపు ఆత్మీయంగా మాట్లాడారు.