తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతోంది?
నల్లగొండ కాల్పుల్లో గాయపడ్డ ఎస్ఐ సిద్ధయ్య మరణం.. మూడు రోజుల కిందట ఇద్దరు సిమి ముష్కరుల హతం.. ముగ్గురు కానిస్టేబుళ్ల మృతి.. ఈ రోజు చిత్తూరు జిల్లాలో 20 మంది ఎర్రచందనం స్మగ్లర్ల ఎన్కౌంటర్.. వరంగల్ జిల్లాలో ఉగ్రవాది వికారుద్దీన్ సహా అతడి గ్యాంగ్ను పోలీసులు కాల్చిచంపడం.. గత వారంరోజులగా తెలుగు ప్రజలు సహా పోలీసులు, దర్యాప్తు సంస్థలకు కంటిమీద కునుచేస్తోన్న అంశాలపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ దృష్టిసారించింది. తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతోందంటూ ఆరా తీసింది.
మంగళవారం ఢిల్లీలో కేంద్ర హోం శాఖ కార్యదర్శి ఎల్ సీ గోయల్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ అంశాన్ని గురించే చర్చించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాల్లో చోటుచేసుకున్న ఎన్కౌంటర్లపై సత్వరమే నివేదిక పంపాలని హోం సెక్రటరీ గోయల్.. ఏపీ, తెలంగాణ డీజీపీలను ఆదేశించారు.
చిత్తూరు ఎన్కౌంటర్పై ఏపీ సీఎం చంద్రబాబు.. కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్తోపాటు గవర్నర్ నరసింహన్కు వివరణ ఇచ్చారు. మృతులకు ఏపీ ప్రభుత్వమే నష్టపరిహారం చెల్లించాలని తమిళనాడు సీఎం పన్నీర్ సెల్వం డిమాండ్ చేశారు. పలు తమిళపార్టీల హెచ్చరికల నేపథ్యంలో ఆ రాష్ట్రానికి వెళ్లే బస్సు సర్వీసులను అధికారులు నిలిపివేశారు.