'అసలు మేమెందుకు సరెండర్ కావాలి?'
న్యూఢిల్లీ: అసలు తామెందుకు పోలీసులకు సరెండర్ కావాలని రాజద్రోహం కేసు ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో ముగ్గురు జేఎన్యూ విద్యార్థులు ప్రశ్నించారు. ఇప్పటికే ముగ్గురు జేఎన్యూ విద్యార్ధులు జ్యుడిషియల్ కస్టడీలోకి వెళ్లగా వీరు మాత్రం తాము సరెండర్ అయ్యే సమస్యే లేదని అంటున్నారు. జేఎన్యూ విద్యార్థులు కన్హయ్య కుమార్ ను పోలీసులు అరెస్టు చేసిన అనంతరం ఉమర్ ఖలీద్, అనిర్బన్ భట్టాచార్య, రామనాగా, అశుతోష్ కుమార్ కనిపించకుండాపోయిన విషయం తెలిసిందే.
అయితే, కోర్టు ఆదేశాలతో ఉమర్ ఖలీద్, అనిర్బన్ భట్టాచార్య పోలీసులకు లొంగిపోయారు. కానీ, జేఎన్యూ స్టూడెంట్స్ యూనియన్(జేఎన్యూఎస్యూ) జనరల్ సెక్రటరీ రామ నాగా, అశుతోష్ కుమార్, అనంత్ ప్రకాశ్ మాత్రం పోలీసులకు లొంగిపోయేందుకు నిరాకరించారు. 'మేం ఎందుకు సరెండర్ కావాలి? మేం పోలీసులకు హాస్టల్ నెంబర్ ఇచ్చాం. రూమ్ నెంబర్, కాంటాక్ట్ వివరాలు కూడా ఇచ్చాం. మేం క్యాంపస్లోనే ఉన్నాం. నిర్ణయించుకోవాల్సింది పోలీసులే' అంటూ ప్రకాశ్ మీడియా సమావేశంలో చెప్పాడు.