మోడీ కంటే కేజ్రీ మేలు: షకీల్
Published Mon, Feb 17 2014 1:56 AM | Last Updated on Wed, Aug 15 2018 2:14 PM
న్యూఢిల్లీ: బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ కంటే ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాలే మెరుగని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి షకీల్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలపై సొంత పార్టీ నుంచే అభ్యంతరం వ్యక్తమైంది. కేజ్రీవాల్ కనీసం తన జాతీయ ఆకాంక్షలకోసం సీఎం పదవి వదులుకున్నారని, మోడీ మాత్రం గుజరాత్ సీఎం పీఠానికి అంటిపెట్టుకుని ఉన్నారని షకీల్ ఆదివారం ట్విట్టర్‌లో ఎద్దేవా చేశారు.
అయితే వాటిని అసంబద్ధ వ్యాఖ్యలుగా కాంగ్రెస్ అధికార ప్రతినిధి సత్యవ్రత్ చతుర్వేది కొట్టిపారేయడం విశేషం. కాంగ్రెస్ మద్దతిచ్చినా 49 రోజుల కన్నా ప్రభుత్వాన్ని నడపలేని కేజ్రీవాల్‌ను మోడీ కంటే మెరుగెలా అవుతారని ఆయన ప్రశ్నించారు. ‘‘ఇలాంటి వ్యాఖ్యలు చేయడంలో అర్థం లేదు. పైగా అవి కాంగ్రెస్ ఇమేజీనీ దెబ్బతీస్తాయి. కేజ్రీవాల్ అనుభవ శూన్యుడు. మోడీ మతవాది. వారిలో ఎవరినీ మెరుగని చెప్పలేం’’ అన్నారు. బీజేపీ కూడా షకీల్ వ్యాఖ్యలను తూర్పారబట్టింది.
Advertisement
Advertisement