సై.. అన్న షీలా దీక్షిత్
న్యూఢిల్లీ: వచ్చేఏడాది జరగనున్న ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో షీలాదీక్షిత్ (78) ముఖ్యమంత్రి అభ్యర్థిగా తలపడనున్నారా? అందుకు షీలా తన అంగీకారాన్ని తెలిపారా? అవుననే అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. ఇన్నాళ్లూ ఉత్తరప్రదేశ్ లో క్రియాశీల బాధ్యతలను కాదంటూ వచ్చిన షీలా.. ఎట్టకేలకు తన అనుమతిని తెలిపినట్టు సమాచారం. పార్టీ తనను ఏమైనా చేయాలని ఆదేశిస్తే.. అందుకు తాను సిద్ధంగా ఉంటానని షీలా ఇటీవల తెలిపారు.
ఉత్తరప్రదేశ్ కోడలినని చెప్పుకొంటున్న షీలాను రంగంలోకి దించితే బ్రాహ్మణుల ఓట్లు పడే అవకాశం ఉన్నట్టు ఆపార్టీ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అధిష్టానానికి సూచించారని, దీంతో అధిష్టానం ఆదేశాలను షీలాదీక్షిత్ కాదనలేకపోయారని తెలుస్తోంది. ప్రశాంత్ కిషోర్ 2014 లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, 2015 లో నితీష్ కుమార్ లకు ఎన్నికల ప్రచార వ్యూహకర్తగా పని చేశారు.
మరోవైపు, ఇందిర మనవరాలు ప్రియాంకగాంధీ సైతం యూపీ ఎన్నికల్లో ముమ్మరంగా ప్రచారం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇన్నాళ్లూ కేవలం అమేథీ, రాయ్ బరేలీ నియోజకవర్గాల్లో మాత్రమే ప్రచారం చేస్తూ వచ్చిన ప్రియాంక.. ఈసారి ఎలాగైనా యూపీలో తమ పార్టీని అధికారంలోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో పూర్తిస్థాయిలో ప‍్రచారం చేస్తారని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. అయితే కొందరు నేతలు మాత్రం ఈ ప్రచారాన్ని ఖండిస్తున్నారు.