సాక్షి, న్యూఢిల్లీ: రాజస్ధాన్‌లో అశోక్ గహ్లోత్ సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు రెబల్ ఎమ్మెల్యే భన్వర్‌లాల్ శర్మతో కలిసి కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, బీజేపీ నేత సంజయ్ జైన్ యత్నించారన్న కాంగ్రెస్ ఆరోపణలపై షెకావత్ స్పందించారు. ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేశారనే కాంగ్రెస్ ఆరోపణలు అవాస్తవమని, సోషల్ మీడియాలో వైరలైన ఆడియో క్లిప్ నకిలీదని కేంద్ర మంత్రి షెకావత్ స్పష్టం చేశారు. ఈ క్లిప్‌లో వాయిస్ తనది కాదని అన్నారు. ఈ వ్యవహారంలో ఎలాంటి విచారణకైనా తాను సిద్ధమని, దర్యాప్తు సంస్ధ ఎదుట హాజరయ్యేందుకు సిద్డమని చెప్పారు.
రాజస్ధాన్ సర్కార్‌ను కూల్చేందుకు కేంద్ర మంత్రి షెకావత్, బీజేపీ నేత సంజయ్ జైన్, రెబల్ ఎమ్మెల్యే భన్వర్‌లాల్ శర్మతో కలిసి ప్రయత్నించారని కాంగ్రెస్ పార్టీ రాజస్ధాన్ పోలీస్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (ఎస్‌ఓజీ)నకు ఫిర్యాదు చేసింది. వారి కుట్రలకు సంబంధించిన మూడు ఆడియో టేపులు కూడా తమ వద్ద ఉన్నాయని కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి రణదీప్ సింగ్ సుర్జేవాల తెలిపారు. అసమ్మతి ఎమ్మెల్యేలు, బీజేపీ నేతల కుట్రలను వెలికి తీయాలని ఆయన ఎస్‌ఓజీ పోలీస్ అధికారులను కోరారు. కాంగ్రెస్ ఫిర్యాదు మేరకు గజేంద్ర సింగ్ షెకావత్, సంజయ్ జైన్, భన్వర్‌లాల్ శర్మపై ఎస్‌ఓజీ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్టు సమాచారం. ఈ ఆరోపణలపై రెబల్ ఎమ్మెల్యేలు భన్వర్‌లాల్ శర్మ, విశ్వేంద్ర సింగ్‌ల పార్టీ ప్రాథమిక సభ్యత్వాలను కాంగ్రెస్ రద్దు చేసింది. వారికి షోకాజ్ నోటీసులను జారీ చేసింది. చదవండి: వసుంధర రాజేపై సంచలన ఆరోపణలు
Comments
Please login to add a commentAdd a comment