డిగ్గీరాజా రికార్డు బద్దలయింది
భోపాల్: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ సరికొత్త రికార్డు సృష్టించారు. ఆదివారం ముఖ్యమంత్రి స్థానంలో పదేళ్లు పూర్తి చేసుకొని అంతకుముందు మధ్యప్రదేశ్ నుంచి కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్కు ఉన్న రికార్డును బద్దలు కొట్టేశారు. పదేళ్లకాలంపాటు మధ్యప్రదేశ్ లో ముఖ్యమంత్రి స్ధానంలో ఉన్న కాంగ్రెసేతర ముఖ్యమంత్రిగా కూడా ఆయన కొత్త రికార్డును లిఖించారు.
2005లో తొలిసారి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన శివరాజ్ సింగ్ చౌహాన్.. తొలిసారి ఎమ్మెల్యేగా బుద్ని నియోజకవర్గం నుంచి 1989-90 మధ్యలో ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా బీజేపీ అగ్రనేతలు ప్రధాని నరేంద్రమోదీ, అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్ వంటి నేతలు అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా శివరాజ్ సింగ్ మాట్లాడుతూ బీజేపీ సిద్ధాంతం నచ్చి ఓ సామాన్య కార్యకర్తగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన తాను మొత్తం జీవితాన్ని ప్రజలకోసమే వెచ్చించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ప్రధాని మోదీతో సహా పలువురు అగ్రనేతలు తనకు ఫోన్ కాల్ చేసి అభినందించారని, తన పనితీరు బాగుందని ప్రశంసలు కురిపించారని చెప్పారు. దిగ్విజయ్ సింగ్ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా 1993 నుంచి 2003మధ్యకాలంలో పదేళ్లపాటు పనిచేశారు.