బిహార్లో మరో హైటెక్ కాపీయింగ్
పాట్నాః జనతాదళ్ పాలిస్తున్న బిహార్ రాష్ట్రంలో విద్యారంగం అవినీతిలో కూరుకుపోయింది. అందుకు తాజాగా మరో ఉదంతం వెలుగులోకి వచ్చింది. స్థానిక రోటాస్ కళాశాల విద్యార్థులు గుంపులు గుంపులుగా నేలపై కూర్చొని, మొబైల్ లైట్లతో పరీక్షలు రాయడం మళ్ళీ కలకలం రేపింది.
బిహార్ రోటాస్ కాలేజీ విద్యార్థులు పరీక్షలు రాసిన తీరు చూస్తే... యాజమాన్య అలసత్వం, విద్యారంగంలో డొల్లతనం మరోసారి బయటపడింది. స్నేహంలోనే కాదు పరీక్షలు రాయడంలోనూ విద్యార్థులు ఐకమత్యాన్ని ప్రదర్శించారు. ఇటీవల బిహార్ లో 12వ తరగతి విద్యార్థుల పరీక్షల టాపర్స్ స్కాం వెలుగులోకి వచ్చి, విచారణలో నిజాలు బహిర్గతమైనా అక్కడి పరిస్థితి మాత్రం మారలేదు. తాజాగా రోటాస్ కాలేజీ విద్యార్థులు నేలమీద గుంపుగా కూర్చుని, మొబైల్ లైట్ల వెలుగులో హాయిగా కలసి మెలసి పరీక్షలు రాస్తున్నట్లుగా బయటపడ్డ ఫొటోలు ఇప్పుడు అక్కడి విద్యారంగాన్నే ప్రశ్నిస్తున్నాయి. రోటాస్ కాలేజీలో కనీస సౌకర్యాలు కూడ లేవన్నదానికి ప్రస్తుతం బయటపడ్డ ఫొటోలు ప్రత్యక్ష సాక్ష్యాలుగా కూడ మారాయి.