‘సర్వీసు రూల్స్’పై వేగం పెంచండి
- టీచర్లకు వేర్వేరు సర్వీసు నిబంధనలతో ఇబ్బందులు
- కేంద్ర హోంశాఖను కోరిన తెలంగాణ, ఏపీ
- వెంకయ్యనాయుడు ఆధ్వర్యంలో హోంశాఖ అధికారులతో కడియం శ్రీహరి, గంటా శ్రీనివాసరావు భేటీ
- జూన్ 12లోపు రాష్ట్రపతి ఉత్తర్వులు వెలువడేలా చూడాలని విజ్ఞప్తి
- తెలంగాణకు 84 కేజీబీవీల మంజూరుకు కేంద్రం ఓకే: కడియం
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసు రూల్స్ అమలుకు అవసరమైన చర్యలను వేగవంతం చేయాలని ఇరు రాష్ట్రాలు కేంద్ర హోం శాఖకు విజ్ఞప్తి చేశాయి. పంచాయతీరాజ్ టీచర్లకు, ప్రభుత్వ టీచర్లకు వేర్వేరు సర్వీసు నిబం ధనలు ఉండడం వల్ల సమస్యలు తలెత్తుతున్నాయని, అందువల్ల ఏకీకృత సర్వీసు రూల్స్ అమలు చేసి... ఇరు రాష్ట్రాల్లో విద్యా ప్రమాణాల పెంపునకు తోడ్పడాలని కోరారు. ఏకీకృత సర్వీసు రూల్స్‌ను ఇటీవలే ఆమోదించిన కేంద్ర న్యాయ శాఖ.. ఆ ఫైలును కేంద్ర హోం శాఖకు పంపింది.
ఈ నేపథ్యంలో బుధవారం కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుతో ఇరు రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులు కడియం శ్రీహరి, గంటా శ్రీనివాసరావు సమావేశమయ్యారు. ఇందులో కేంద్ర హోం శాఖ సంయుక్త కార్యదర్శి దిలీప్ కుమార్, డైరెక్టర్ అశుతోష్ మిశ్రాజైన్‌లు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. దాదాపు 20 ఏళ్లుగా ఉపాధ్యాయులు నిరీక్షిస్తున్న ఏకీకృత సర్వీసు రూల్స్‌కు రాష్ట్రపతి ఆమోదం లభించేలా చర్యలు తీసుకోవాలని కడియం, గంటా విజ్ఞప్తి చేశారు. దీనిపై వెంకయ్యనాయుడు కేంద్ర హోంశాఖ కార్యదర్శితో ఫోన్‌లో మాట్లాడారు. సర్వీసు రూల్స్‌పై కేంద్ర న్యాయశాఖ పంపిన ఫైలును వీలైనంత త్వరగా ఆమోదించి రాష్ట్రపతికి పంపాలని కోరారు.
విద్యా ప్రమాణాల మెరుగు..
వెంకయ్యనాయుడుతో భేటీ అనంతరం కడి యం మీడియాతో మాట్లాడారు. ఏకీకృత సర్వీసు నిబంధనలను అమలు చేయడం వల్ల విద్యా ప్రమాణాల మెరుగుకు ఆస్కారం ఉం టుందన్నారు. ప్రభుత్వ టీచర్లతో సమానంగా పంచాయతీరాజ్, మండల, జిల్లా పరిషత్ ఉపాధ్యాయులకు పదోన్నతులు లభిస్తాయని చెప్పారు. డీఈవో, డిప్యూటీ డీఈవో, ఎంఈవో పోస్టులను భర్తీ చేస్తే విద్యా ప్రమాణాల పెంపు, పర్యవేక్షణకు వీలు కలుగుతుందని చెప్పారు. సర్వీసు రూల్స్ ఫైలును వెంటనే రాష్ట్రపతి ఆమోదానికి పంపి జూన్ 12 (పాఠశాలల పునఃప్రారంభం) లోపు ఉత్తర్వులు వెలువడేలా చర్యలు తీసుకోవాలని కోరామన్నారు.
డిటెన్షన్‌ను వ్యతిరేకించాం..
ఐదు, ఎనిమిదో తరగతుల్లో డిటెన్షన్ విధానాన్ని అమలు చేయాలన్న కేంద్రం ప్రతిపాదనపై ముఖ్యమంత్రితో చర్చించాక అభిప్రాయాన్ని వెల్లడిస్తామని కేంద్ర మంత్రికి వివరించామన్నారు. వాస్తవానికి ఈ విధానాన్ని గతంలోనే వ్యతిరేకించామని.. గ్రామీణ ప్రాంతాల్లో స్కూల్ డ్రాపౌట్లకు ఆస్కారమిచ్చే అవకాశం ఉండడమే దానికి కారణమని చెప్పారు. ప్రస్తుతమున్న విద్యా వ్యవస్థలో విద్యార్థుల వైఫల్యాలను ఎత్తిచూపడం సరికాదని వ్యాఖ్యానించారు. ఇక తెలంగాణలోని ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
తెలంగాణకు 84 కేజీబీవీలు
రాష్ట్రంలో వెనుకబడిన మండలాల్లో 84 కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయా ల(కేజీబీవీ) మంజూరుకు కేంద్రం అంగీకరించినట్టు కడియం తెలిపారు. బుధవారం ఢిల్లీలో కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్‌ను కలసిన అనంతరం వివరాలను వెల్లడించారు. తెలంగాణకు 110 కేజీబీవీలను మం జూరు చేయాలని కోరగా.. వచ్చే విద్యా సంవత్సరం నుంచి 84 కేజీబీవీలను ప్రారంభించడానికి అంగీకరించారని తెలి పారు. అందులో 32 విద్యాలయాలకు కొత్త భవనాలు నిర్మించి ప్రారంభించడానికి నిధులు మంజూరు చేయనున్నారని, మిగతా వాటిని తాత్కాలిక భవనాల్లో ప్రారంభిస్తారన్నారు. అలాగే 29 రెసిడెన్షి యల్ పాఠశాలలకు అనుమతులు ఇచ్చార ని చెప్పారు. ఇక కేజీబీవీల్లో ప్రస్తుతం ఎనిమిదో తరగతి వరకు కల్పిస్తున్న మధ్యాహ్న భోజన సదుపాయాన్ని పదో తరగతి వరకు పెంచాలని... యూపీఏ హయాంలో మాదిరిగా ఎన్డీయే ప్రభుత్వం కూడా మోడల్ స్కూళ్లకు నిధులు మంజూ రు చేయాలని కోరామని తెలిపారు.