
డేరింగ్ యోగి.. బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ వెనుక..
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌పై విమర్శల దాడి చేశారు. ప్రధాని మోదీ ప్రభుత్వం మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తొలిసారి బిహార్ పర్యటనకు వచ్చిన ఆయన దర్భాంగలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ వెనుక ఏర్పాటుచేసిన పోడియం వద్ద నుంచి ప్రసంగించారు. ఈ సందర్భంగా నితీశ్‌కు పలు సవాళ్లు విసిరారు. దమ్ముంటే కబేళాలను మూసివేయాలని, ట్రిపుల్ తలాక్‌పై ఇప్పటి వరకు ఎందుకు నోరు మెదపలేదని ప్రశ్నించారు. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌తో కలిసి భాగస్వామ్యం ఏర్పాటుచేసుకోవడం సహజమైన చర్య కాదని, తాము అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే యూపీలో సమన్యాయ పాలన తీసుకొచ్చామని చెప్పారు.
‘ఉత్తరప్రదేశ్‌లో సమన్యాయం ఉంది.. ఏ ఒక్కరినీ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడాన్ని నా ప్రభుత్వం అనుమతించదు. అందరికీ భద్రత హామీనివ్వడం ప్రభుత్వ బాధ్యత.. ఎవరు నిబంధనలు అతిక్రమిస్తున్నారో వారిని శిక్షించడం చట్టం చేయాల్సిన పని. అది మీ ప్రభుత్వం చేస్తుందా?’ అని ప్రశ్నించారు. కాగా, యోగి బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ వెనుక ఉండి ప్రసంగించడం చర్చనీయాంశమైంది. రాష్ట్ర పోలీసులు దానిని ఏర్పాటుచేశారా లేక యోగి వ్యక్తిగత భద్రతా సిబ్బంది అలా చేశారా? లేక బిహార్‌లో శాంతియుత పరిస్థితులు సరిగా లేవని చెప్పేందుకు అలా చేశారా అనేది మాత్రం ఇంకా తెలియలేదు.