
నింగిలోకి ‘తేజస్ పీవీ-6’ యుద్ధ విమానం
భారత్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తేలికపాటి యుద్ధ విమానం ‘తేజస్ పీవీ(ప్రొటోటైప్ వెహికల్)-6’ శుక్రవారం మధ్యాహ్నం విజయవంతంగా నింగికి ఎగిరింది.
- తొలిసారిగా ఎగిరిన తుది ట్రెయినర్ వెర్షన్
- తేజస్ ప్రాజెక్టులో మరో కీలక విజయం
న్యూఢిల్లీ: భారత్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తేలికపాటి యుద్ధ విమానం ‘తేజస్ పీవీ(ప్రొటోటైప్ వెహికల్)-6’ శుక్రవారం మధ్యాహ్నం విజయవంతంగా నింగికి ఎగిరింది. తేజస్ యుద్ధ విమానాల్లో తుది రకం శిక్షణ విమానం అయిన రెండు సీట్ల తేజస్ పీవీ-6ను గ్రూప్ కెప్టెన్‌లు వివర్త్ సింగ్, అనూప్ కబద్వాల్‌లు విజయవంతంగా నడిపారు.
రెండు దశాబ్దాల కాలంలో మొత్తం 15 వెర్షన్ల తేజస్ విమానాలు గాలిలోకి ఎగరగా.. ఇది చివరిదైన 16వ వెర్షన్‌కు చెందినది. ఇప్పటిదాకా తేజస్ విమానాలు 2,500 సార్లకుపైగా నింగికి ఎగిరాయి. అన్ని తేజస్ విమానాల్లోనూ ఉన్న ప్రధాన సాంకేతికతలను తేజస్ పీవీ-6లో పొందుపర్చారు. తేజస్ శిక్షణ విమానాలకు ఇదే తుది వెర్షన్ విమానం. దీనిలో ఆధునిక కమ్యూనికేషన్, రాడార్ వ్యవస్థలు, ఈడబ్ల్యూ సెన్సర్లు, ఆటోమేటిక్ ల్యాండింగ్ కోసం కొత్త నావిగేషన్ వ్యవస్థలు ఉన్నాయి.
తాజా విజయంతో స్వదేశీ తేజస్ యుద్ధవిమానం, శిక్షణ విమానాల తయారీ విజయవంతం అయిందని, దీంతో దేశ రక్షణ రంగానికి కొత్త బలం చేకూరుతుందంటూ రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీవో) డెరైక్టర్ జనరల్ అవినాశ్ చందర్ తేజస్ బృందాన్ని అభినందించారు. కాగా, తేజస్‌ను డీఆర్‌డీవో, హెచ్‌ఏఎల్‌లు సంయుక్తంగా అభివృద్ధిపరుస్తున్నాయి.
1983లోనే ఈ ప్రాజెక్టు మొదలైనా.. అనేక అవాంతరాల వల్ల ఆలస్యమవుతూ వచ్చింది. తేజస్ విమానానికి ప్రాథమిక అనుమతి గతేడాదే లభించింది. మరికొన్ని నెలల్లో తుది అనుమతి (ఫైనల్ ఆపరేషనల్ క్లియరెన్స్) లభించాల్సి ఉంది.