
సునంద కేసులో ఆ ముగ్గురికి 'లై డిటెక్టర్' పరీక్షలు
కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్ భార్య సునందా పుష్కర్ హత్య కేసు దర్యాప్తు కీలక మలుపు తీసుకోనుంది. హత్య జరిగిన రోజు.. అంతకు ముందు చోటుచేసుకున్న పరిణామాలను శోధిస్తోన్న ఢిల్లీ పోలీసులు.. ముగ్గురు సాక్షులకు లై డిటెక్టర్ (సత్యశోధన) పరీక్షలు నిర్వహించేందుకు అనుమతినివ్వాలని కోర్టుకు విన్నవించారు.
శశి థరూర్ వ్యక్తిగత సహాయకుడు నారాయణ్ సింగ్, డ్రైవర్ భజరంగి, స్నేహితుడు సంజయ్ దావన్లు దర్యాప్తునకు సహకరించడంలేదని, జవాబులు తెలినప్పటికీ కీలకమైన ప్రశ్నలు కొన్నింటికి సమాధానాలు దాటవేస్తున్నారని, అందుకే ఆ ముగ్గురికి లై డిటెక్టర్ పరీక్షలు నిర్వహించాల్సిఉందని పోలీసులు కోర్టుకు తెలిపారు. సదరు సాక్షులు ముగ్గురు మే 20న కోర్టుకు హాజరుకానున్న నేపథ్యంలో ఆ రోజే వారిని పోలీసు కస్టడీకి అప్పగించే అవకాశాలు ఉన్నట్లు తెలిసింది.