గాంధీనగర్: లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన మంత్రి కుమారుడికి ఝలక్ ఇచ్చి దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన గుజరాత్ మహిళా కానిస్టేబుల్ సునీతా యాదవ్ తన ఉద్యోగానికి రాజీనామా చేసి మరో సంచలనానికి తెర తీసిన సంగతి తెలిసిందే. అంతేకాదు.. తిరిగి లాఠీతో వస్తానని, ఈసారి ఐపీఎస్‌గా అడుగుపెడతానని ఆమె స్పష్టం చేశారు. నెటిజనులు సునీతా చర్యలను మెచ్చుకుంటూ.. ఆమెని ‘లేడీ సింగం ’ అంటూ ప్రశంసిస్తున్నారు. ఈ క్రమంలో ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె.. రాజకీయాలు, పోలీసు అధికారుల విధులకు సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకు మీడియాలో వచ్చింది కేవలం 10 శాతం మాత్రమేనని.. తన వద్ద ఇంకా 90 శాతం విషయాలు ఉన్నాయని సునీతా యాదవ్ పేర్కొన్నారు.
తన రాజీనామా ఆమోదించిన అనంతరం అన్ని విషయాలను ప్రజల ముందు పెడతానని సునీత యాదవ్ చెప్పారు. తదనంతర పరిణామాలను ఎదుర్కొనేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ‘అందరు నన్ను లేడీ సింగం అంటున్నారు. కానీ కాదు.. నేను సాధారణ లోక్ రక్షక్ దళ్ (గుజరాత్ పోలీసు విభాగం) అధికారిణిని. ఖాకీ యూనిఫాంలో అబద్ధం ఉందని ఇంతకుముందు అనుకునేదాన్ని. కానీ, అది ఉద్యోగానికి సంబంధించిన ర్యాంక్‌లో ఉందని ఈ ఘటన నిరూపించింది. అందుకే నేను ఐపీఎస్‌కు ప్రిపేర్ కావాలనుకుంటున్నాను. సమస్య తేలిగ్గానే పరిష్కారం అయ్యేది. కానీ సరైన ర్యాంక్ లేకపోవడం వల్ల నన్ను ఇప్పుడు బబుల్‌గమ్‌లా నమిలేస్తున్నారు’ అని సునీతా యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. (లేడీ అండ్ ఆర్డర్)
అంతేకాక ‘ఈ యుద్ధంలో నేను మరణించినా నాకు ఎలాంటి విచారం ఉండదు. నా తోటి ఉద్యోగులతో పాటు ఉన్నతాధికారుల నుంచి నాకు మద్దతు ఉన్నది’ అని సునీతా యాదవ్ పేర్కొన్నారు. ‘ప్రస్తుతం సివిల్స్ సర్వీసెస్‌కు ప్రిపేర్ అవుతున్నానను. ఐపీఎస్‌గా ఎంపికై తిరిగి పోలీసు శాఖలోకి వస్తాను. ఒకవేళ అది సాధ్యం కాకపోతే.. ఎల్‌ఎల్‌బీ చేస్తాను.. లేదా జర్నలిస్ట్‌ను అవుతాను’ అని సునీతా యాదవ్ వెల్లడించారు. మంత్రి అనుచరుల నుంచి తనకు ముప్పు ఉందని.. రక్షణ కల్పించాలని పోలీసు ఉన్నతాధికారులను ఆమె కోరారు. ‘నా పోరాటం సునీతా యాదవ్ కోసం కాదు.. నా పోరాటం ఖాకీ యూనిఫాం కోసం. నాకు ఫోన్‌లో కొన్ని బెదిరింపులు వచ్చాయి. ‘మీరు దేశం కోసం చాలా చేస్తున్నారు.. ఎక్కువ కాలం జీవిస్తారని అనుకోవడం లేదు’ అంటూ ఎద్దేవా చేస్తున్నారు. అలాంటి వారికి తగిన పాఠం చెబుతా’ అని సునీతా యాదవ్ అన్నారు.(‘నా కొడుకు బాధ్యత.. ఉద్యోగం రెండూ ముఖ్యమే’)
సమస్యను పరిష్కరించుకుంటే రూ.50 లక్షలు ఇస్తామని తనకు రాయబారం కూడా పంపారని సునీతా యాదవ్ చెప్పారు. మూడు రోజుల కిందటే కాల్ వచ్చిందని తెలిపారు. ఆ ఫోన్ కాల్ గుజరాత్ రాష్ట్రం బయటి నుంచి వచ్చినట్లుగా కనిపిస్తోందని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. సూరత్ పోలీసు కమిషనర్‌ను కలిసి పోలీసు రక్షణ కోరినట్లు ఆమె వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment